పకడ్బందీగా సన్న బియ్యం పంపిణీ
● రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి, కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీ ప్రక్రియపై సమీక్ష చేశారు. జిల్లాల వారీగా పంపిణీ చేసిన సన్నబియ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం భోజనం అందించాలని, రేషన్‌బియ్యం పక్కదారి పట్టొద్దన్న ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు. సన్నబియ్యం రవాణాకు సంబంధించి అదనపు లారీలు సమకూర్చుకోవాలని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన ఆహారాన్ని రుచి చూడాలని తెలిపారు.
మంచి స్పందన..
జిల్లాలో ఇప్పటివరకు పంపిణీ చేసిన సన్నబియ్యానికి సంబంధించిన వివరాలను మంత్రికి, సీఎస్‌కు కలెక్టర్ అభిలాష అభినవ్ వివరించారు. సన్న బియ్యం పంపిణీపై జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. పంపిణీకి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతీనెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం రుచి చూస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, డీఎం సుధాకర్ పాల్గొన్నారు.


