శ్రీరామా.. చివరికి తడెలా?
మామడ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సరస్వతీ కాలువ ద్వారా జిల్లాలోని 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్ట్‌లో నీటి లభ్యత ఆధారంగా ఏటా వానాకాలం, యాసంగి పంటలకు నీటిని విడుదల చేస్తారు. అయితే, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి యాసంగి పంటలకు ఈనెల 9వ వరకే నీరు ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సారెస్పీ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.
పంటల భవిష్యత్‌పై రైతుల ఆందోళన
సరస్వతీ కాలువ ఆయకట్టులో సాగు చేసిన పంటలు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయి. నీటి సరఫరా ఆగిపోతే పంటలు చేతికి వస్తాయా లేదా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ ద్వారా చెరువుల్లోకి నీరు చేరిన తర్వాత, అక్కడి నుంచి పంటలకు సాగునీరు అందుతుంది. అంతేకాక, కాలువలో నీరు ఉన్నంత వరకు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో పరిసర ప్రాంతాల రైతులు బోర్ల ద్వారా పంటలకు నీటిని సమకూర్చుకుంటారు. ఇప్పుడు నీటి విడుదల ఆగిపోనుండటంతో ఈ ప్రయోజనాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 1,091 అడుగుల వద్ద 80.5 టీఎంసీలు ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1,064.90 అడుగుల వద్ద 15.88 టీఎంసీల నీరు నిల్వలో ఉంది. గత ఏడాది ఏప్రిల్ 1 నాటికి 1,060 అడుగుల వద్ద 10.47 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది నీటి నిల్వ స్థితి గత ఏడాది కంటే కొంత మెరుగ్గానే ఉన్నా.. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయంతో సాగునీటికి ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఎండలకు ప్రాజెక్టులో నీటిమట్టం కూడా వేగంగా పడిపోతోంది.
తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత
శ్రీరాంసాగర్ నుంచి కాకతీయ కాలువ, సరస్వతీ కాలువ, లక్ష్మీ కాలువ, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. కాకతీయ ప్రధాన కాలువ జోన్–2 ఆయకట్టుకు ఈ నెల 2న నీటి సరఫరా నిలిచిపోనుంది. కాకతీయ కాలువ జోన్–1, సరస్వతీ కాలువ, లక్ష్మీ కాలువ, అలీసాగర్ గుత్పా ఎత్తిపోతలకు ఈ నెల 9 వరకు నీటిని విడుదల చేయనున్నారు. అధికారులు రైతులకు ప్రస్తుతం అందుతున్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. సాగునీటి అవసరాలు తీ రిన తర్వాత మిగిలిన నీటిని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా కోసం వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నీటిని సమర్థవంతంగా వాడుకోవాలని, అదే సమయంలో తాగునీటి అవసరాల కు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
సరస్వతీ కాలువ
ఈ నెల 9 వరకే ఆయకట్టుకు సాగునీరు
ప్రాజెక్టులో వేగంగా పడిపోతున్న నీటిమట్టం
తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం
పొదుపుగా వాడుకోవాలని అధికారుల సూచన
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నీటి నిల్వ వివరాలు:
పూర్తిస్థాయి నీటి మట్టం:
1,091 అడుగులు, 80.5 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ :
1,064 అడుగులు, 15.88 టీఎంసీలు
సరస్వతీ కాలువకు అందిస్తున్న నీరు: 700 క్యూసెక్కులు
ప్రతిరోజు అవుట్ ఫ్లో : 8,146 క్యూసెక్కులు
జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో: 287 టీఎంసీలు
అవుట్ ఫ్లో : 278.9 టీఎంసీలు
పొట్టదశలో పొలాలు..
యాసంగిలో సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. పంటలు చేతికందే వరకు కాలువ నీటిని అందించాలి. లేదంటే చివరికి నీరందక గింజ తాలుగా మారుతుంది. దిగుబడి తగ్గుతుంది. దీంతో తీవ్రంగా నష్టపోతాం.
– భీంరెడ్డి, రైతు, కొరిటికల్
శ్రీరామా.. చివరికి తడెలా?


