పద్యకవికి అరుదైన గౌరవం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన పద్యకవి, సంస్కృత భాషా ప్రచార సమితి ఉమ్మడి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు బి.వెంకట్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ‘పద్య వైభవం’ పుస్తకావిష్కరణ–కవి సమ్మేళనం కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. నూతనంగా ఆవిష్కృతమైన ‘పద్య వైభవం’ గ్రంథంలో వెంకట్ రచించిన పద్యజీవాలు అనే శీర్షిక పద్యాలు ప్రచురణకు ఎంపికయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది కవులు తమ రచనలను పంపగా వెంకట్ పద్య రచనలు ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా పద్యవైభవ పురస్కారంతో పాటు నూతనంగా ప్రచురితమైన గ్రంథాన్ని ఆయనకు అందజేశారు. పద్య సరస్వత పీఠం అధ్యక్షులు భాను ప్రకాష్ ఆచార్య, ప్రముఖ కవులు కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య టి.గౌరీశంకర్, యువ భారతీయ సంస్థ అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర తదితరులు ఆయనను సత్కరించారు.


