కడుపు నింపని ఉపాధి | - | Sakshi
Sakshi News home page

కడుపు నింపని ఉపాధి

Apr 7 2025 1:18 AM | Updated on Apr 7 2025 1:18 AM

కడుపు

కడుపు నింపని ఉపాధి

లక్ష్మణచాంద: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి ఉన్నచోటే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాబ్‌కార్డు కలిగిన కూలీలకు పని కల్పించడమే కాకుండా వారికి అవసరమైన వసతులు కల్పిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 401 గ్రామ పంచాయతీల్లో 220 మంది క్షేత్ర సహాయకులు పనిచేస్తున్నారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్సార్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019లో క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఆందోళనలు చేపట్టారు. కోర్టుకు కూడా వెళ్లడంతో 2023 సెప్టెంబర్‌ 11న ఎఫ్‌ఏలను విధుల్లోకి తీసుకున్నారు.

మూడు నెలలుగా అందని వైనం

ఉపాధిహామి పథకంలో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లలో గ్రేడ్‌ 1 ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.12,200, గ్రేడ్‌ 2 ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.10,120, గ్రేడ్‌ 3 ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.9,100 వేతనాలు చెల్లిస్తోంది. కానీ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన వేతనాలు ఇప్పటికీ అందలేదు. దీంతో జిల్లాలో ఉన్న క్షేత్ర సహాయకులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.

వెంటనే విడుదల చేయాలి

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఉన్నతాధికారులు చెప్పిన ప్రతీపని చేస్తున్నారు. అయినా వారికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎఫ్‌ఏల పెండింగ్‌ వేతనాలు చెల్లించి ఆదుకోవాలి.

– సాయేందర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు

ఆర్థికంగా ఇబ్బంది..

ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడమే కాకుండా పనిస్థలాల్లో వసతులు కల్పిస్తున్న మాకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలి.

– రాములు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సంఘం మండల అధ్యక్షుడు, లక్ష్మణచాంద

ఎఫ్‌ఏలకు మూడు నెలలుగా అందని వేతనాలు

జిల్లాలో 220 మంది క్షేత్ర సహాయకులు

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సిబ్బంది

కడుపు నింపని ఉపాధి1
1/2

కడుపు నింపని ఉపాధి

కడుపు నింపని ఉపాధి2
2/2

కడుపు నింపని ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement