పసుపు పంట దొంగతనం.. వ్యక్తి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పసుపు పంట దొంగతనం.. వ్యక్తి రిమాండ్‌

Apr 8 2025 7:41 AM | Updated on Apr 8 2025 7:41 AM

పసుపు

పసుపు పంట దొంగతనం.. వ్యక్తి రిమాండ్‌

లక్ష్మణచాంద: పసుపు పంటను దొంగతనం చేసి విక్రయిస్తూ వ్యక్తి పట్టుబడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పలు గ్రామాలలో గత కొన్ని రోజులుగా పసుపు పంట దొంగతనం జరుగుతోంది. రెండు రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన బొగడమీది ముత్తన్న అనే రైతు పసుపు పంట దొంగతనం జరిగినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసే క్రమంలో సోమవారం మండలంలోని పొట్టపెల్లి గ్రామానికి చెందిన మాచిట్ల శ్రీనివాస్‌ మండలంలోని కనకపూర్‌లోని ఖలీల్‌ ట్రేడర్‌షాప్‌లో పసుపు పంట విక్రయిస్తూ పట్టుపడ్డాడు. అతడిని విచారించగా తాను పసుపు పంటను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు శిక్షణ ఎస్సై జుబేర్‌ తెలిపారు.

భూతగాదాల్లో ముగ్గురికి జైలు

భీమారం: భూ తగాదాల్లో మండలంలోని మద్దికల్‌ గ్రామానికి చెందిన చిలకాని కనకయ్య, చిలకాని మాదయ్య, బండం శ్రీనివాస్‌లకు సంవత్సరం జైలుశిక్ష విధిస్తూ చెన్నూర్‌ కోర్టు న్యాయమూర్తి పర్వతపు రవి సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మద్ది కల్‌ శివారులో దాహగామ ఉమామహేశ్వర్‌రావుకు చెందిన భూమిలో 16, ఫిబ్రవరి, 2018లో ట్రాక్టర్‌ ద్వారా దున్నుతుండగా అదే గ్రామానికి చెందిన కనకయ్య, మాదయ్య, శ్రీనివాస్‌లు వెళ్లి దున్నడం ఆపాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కోర్టులో 10 మంది సాక్షులను ప్రవేశ పెట్టారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలుశిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.

‘నీతి ఆయోగ్‌’లో నార్నూర్‌ ముందంజ

నార్నూర్‌: నీతి ఆయోగ్‌ ‘ఆకాంక్ష’ బ్లాక్‌లో నార్నూర్‌ మండలం ఎంపికై అభివృద్ధి సాధిస్తుందని, మొదటి 30 బ్లాక్‌లల్లో మొదటి స్థానంలో ఉందని ఆకాంక్ష డైరెక్టర్‌ మనోజ్‌సింగ్‌ బోరా అన్నారు. ఆయన సోమవారం తన బృందంతో కలిసి మండలంలోని జామ్‌డా, గుంజాల గ్రామాల్లో పర్యటించారు. జామ్‌డాలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన బృందం సందర్శించింది. విద్యార్థినులు వీక్షిస్తున్న డిజిటల్‌ తరగతులను బృందం డైరెక్టర్‌ మనోజ్‌సింగ్‌బోరా పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు అనిల్‌ చహ్వాణ్‌, కే బాషా, జెడ్పీ సీఈవో జితేందర్‌ రెడ్డి, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్‌ రాథోడ్‌, డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, పీడీ మిల్కా, సీడీపీవో శారద, సూపరింటెండెంట్‌ గంగాసింగ్‌ రాథోడ్‌, ఎంపీవో సాయిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

అడవి పంది దాడి.. ఒకరికి గాయాలు

ఇచ్చోడ: అడవిపంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. అడేగామ(కే)లో బద్దం రమేశ్‌ రెడ్డి వద్ద పాలేరు పని చేసే గణపతి వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అడవి పంది దాడి చేయడంతో గణపతి తీవ్రంగా గాయపడ్డాడు.

పసుపు పంట దొంగతనం.. వ్యక్తి రిమాండ్‌1
1/1

పసుపు పంట దొంగతనం.. వ్యక్తి రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement