
మరో తడిపై రైతుల ఆశలు
● రేపటి వరకు ఏడు తడులు పూర్తి ● పొట్టదశలో వరి పంట ● యాసంగి సాగు ఆలస్యంతో సమస్య ● ఆందోళనలో సదర్‌మట్ ఆయకట్టు రైతులు
కడెం: సదర్‌మట్ ఆయకట్టు ద్వారా ఖానాపూర్, కడెం మండలాలకు ఏటా ఏడు తడుల నీటిని వారబందీ పద్దతిన అధికారులు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 9తో ఏడు తడులు పూర్తికావడంతో నీటి విడుదల నిలిపివేయనున్నారు. ఈనేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్టదశలో ఉందని ఈసమయంలో సాగు నీటిని అందించకుంటే పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. ఆయకట్టుకు మరోతడి సాగు నీరు అందించి పంటను కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా సదర్‌మట్ ఆయకట్టు ద్వారా ఖానాపూర్, కడెం మండలాల్లో 13వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈఏడాది యాసంగిలో నాట్లు కాస్త ఆలస్యం కావడంతో సాగు నీటి సమస్య ఉత్పన్నమవుతోంది.
ఏడు తడులు..
సదర్‌మట్ ఆయకట్టుకు జనవరి 2 నుంచి వారబందీ పద్ధతిన (ఏడు రోజులు నీటి విడుదల, ఎనిమిది రోజులు నిలిపివేత) ఏప్రిల్ 9వరకు ఏడు తడుల నీటిని అందిస్తున్నారు. సదర్‌మట్ కేటాయించింది 600 క్యూసెక్కులు కాగ, పైనుంచి మాత్రం 360, 450 క్యూసెక్కుల చొప్పున నీటిని మాత్రమే విడుదల చేశారు. దీంతో కడెం మండలంలోని పాతమద్దిపడగ, కొత్తమద్దిపడగ, పెద్దూర్, వకీల్‌నగర్, చిట్యాల్ తదితర గ్రామాలకు సక్రమంగా సాగునీరందక కొన్ని చోట్ల పంటలు ఎండిపోయాయి. ఇటీవల ఆయకట్టును పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్ ఏప్రిల్ చివరి వరకు సాగు నీరందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎస్సార్‌ఎస్పీలో నీటిమట్టం తగ్గడంతో తాగునీటి అవసరాల దష్ట్యా మరో తడిని అందిస్తారో లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, నీటిపారుదల శాఖ సీఈ స్పందించి మరో తడిని అందించాలని రైతులు వేడుకుంటున్నారు.
సదర్‌మట్ ఆనకట్ట