నిలిచిన నట్టల మందు పంపిణీ
● రెండేళ్లుగా అందని ఉచిత మందులు ● ప్రైవేటుకు వెళ్తున్న పశు పోషకులు
లక్ష్మణచాంద: జిల్లాలో పశువులకు గతంలో ఏటా రెండు విడతల్లో నట్టల నివారణ మందు ఉచితంగా పంపిణీ చేసేవారు. రెండేళ్లుగా ఉచిత పంపిణీ నిలిచిపోయింది. దీంతో పశుపోషకులు ప్రైవేటుకు వెళ్తున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో ప్రభుత్వం తరఫున పశువైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి గొర్రెలు, మేకలు, గేదెలకు నట్టల నివారణ మందులు అందించేవారు. ప్రస్తుతం కార్యక్రమం ఆగిపోవడంతో పశువులు నట్టల వ్యాధి బారిన పడి ఎదుగుదల సరిగా లేక, ఆర్థిక నష్టాలు తప్పడం లేదని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశువులకు ఆరోగ్య సమస్య
నట్టలు (పరాన్న జీవులు) పశువుల పేగుల్లో రక్తాన్ని తాగడం వల్ల గొర్రెలు, మేకలు, గేదెల ఎదుగుదల తగ్గుతుంది. గతంలో ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు నట్టల నివారణ మందులను ఉచితంగా అందించేది, దీంతో ఈ సమస్య నియంత్రణలో ఉండేది. ఇప్పుడు ఈ కార్యక్రమం లేకపోవడంతో రైతులు ప్రైవేటు మందులను కొనుగోలు చేయవలసి వస్తోంది, ఇది ఆర్థిక భారాన్ని పెంచుతోంది.
పునఃప్రారంభించాలని వినతి..
నిర్మల్ జిల్లాలో 3.42 లక్షల పశువులు (48,496 ఆవులు, 55,024 గేదెలు, 1,98,486 గొర్రెలు, 40,755 మేకలు) ఉన్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. ఈ పశువుల ఆరోగ్యం కోసం నట్టల నివారణ మందులు అవసరం. ప్రభుత్వం వెంటనే గత కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని పశుపోషకులు కోరుతున్నారు. దూడలకు 7 రోజుల లోపు మందులు ఇవ్వడం, పేడ పరీక్షల ద్వారా నట్టలను గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటే మరణాల రేటు తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.
జిల్లాలో పశువుల వివరాలు..
ఆవులు 48,496 గేదెలు 55,024
గొర్రెలు 1,98,486 మేకలు 40,755
మొత్తం 3,42,761
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
రాష్ట్ర ప్రభుత్వం నట్టల నివారణ మందుల పంపిణీని రెండేళ్లుగా చేయడం లేదు. మార్చి నెలలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విషయమై చర్చించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి.. మందులు సరఫరా కాగానే జిల్లాలో పంపిణీకి చర్యలు చేపడతాం. – ఎండీ.బాలిగ్
అహ్మద్, జిల్లా పశు వైధ్యాధికారి


