చరిత్రలో నిలిచిన వీరుడు రాంజీ గోండు
నిర్మల్‌చైన్‌గేట్: 1836 నుంచి 1860 వరకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, నిజాం దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల పక్షాన సాయుధ పోరాటాన్ని నడిపించిన గొప్ప నాయకుడు రాంజీ గోండు అని పలువురు వక్తలు కొనియాడారు. రాంజీ గోండు అమరత్వానికి 165 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రాంజీ గోండు వర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఖురానాపేట్ సమీపంలోని వెయ్యి ఉరుల ప్రాంతంలో ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పూజలు, గోండు సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు ర్యాలీగా బయలుదేరి చైన్‌గేట్ వద్ద రాంజీగోండు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ జిల్లా కార్యదర్శి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు తొడసం శంభు ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రాంజీ గోండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రాంజీ గోండు విగ్రహ స్థలాన్ని జాతీయ స్థాయిలో చారిత్రక స్మారకంగా అభివృద్ధి చేయాలని కోరారు. టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు పంద్రం ఆనంద్‌రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ పోశెట్టి, సోయం సూర్యభాను, ఉయిక భీంరావు, అర్జున్, పంద్రం సుజాత, శోభ, ఈశ్వర్, వినోద్, నాగరావు, ఎల్ల య్య, లక్ష్మణ్, గణేశ్, రాము పాల్గొన్నారు.
వీరులను స్మరించుకోవాలి
నిర్మల్ గడ్డపై పోరాడి ప్రాణత్యాగం చేసిన రాంజీ గోండు సహా వెయ్యిమంది వీరులను స్మరించుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. వారి త్యాగాల గురించి ముందు తరాలకు తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాంజీ గోండు వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆయన చిత్రపటం, చైన్‌గేట్‌లోగ ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో ఆంగ్లేయులు, నైజాం పాలకులతో పోరాటం సాగించి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఈ నేలపై నడిపిన గోండు వీరుడే రాంజీగోండు అని కొనియాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చరిత్రలో నిలిచిన వీరుడు రాంజీ గోండు


