కార్తీకం.. పరమ పవిత్రం
నిజామాబాద్ రూరల్: కార్తీక మాసం శివకేశవుల ప్రీతికరం.. అందుకే ఈ మాసాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి మారేడు దళాలతో విష్ణువుకు తులసి దళాలతో ఈ మాసంలో పూజిస్తే అనుకూలమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. తెలుగు నెలల్లో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కార్తీకం అంటే జ్ఞానానికి ప్రతీక. శివుని వంటి దైవం గంగా నది వంటి పవిత్రమైనది. కార్తీక మాసం సమైక్యతను స్ఫూరించే మాసం, ఏడాదిలోని పన్నెండు నెలలకు ఎన్నో ప్రత్యేకతలు పండుగలు ఉంటాయి. మానసిక ఆరోగ్యానికి, ధాన ధర్మాలకు, పరోపకారానికి, సామాజిక అనుబంధానికి కేంద్రమైన మాసం దివ్య కార్తీకం. దేవదేవులైన శివ కేశవులు ఇరువురికి కార్తీక పౌర్ణమి అంటే ఎంతో ప్రీతి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు, వైష్ణవాలయాల్లో సాయంత్రం వేళల్లో ద్వారానికి రెండుదైపులా దీపాలను వెలిగిస్తే సర్వపాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడమే కాకుండా సత్యనారాయణ స్వామి అనుగ్రహం కోసం ఎంతోమంది స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
తులసి కల్యాణం
కార్తీక పౌర్ణమి రోజున మరో ప్రధాన కార్యక్రమం తులసీ కల్యాణం. మన ఆడపడుచులు స్నానం చేసిన తర్వాత తులసీకోటకు ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించడం అనాధిగా వస్తోంది. అయితే కార్తీక పౌర్ణమి రోజున తులసీ కల్యాణాలు నిర్వహిస్తే ఎన్నో జన్మల ఫలంగా భావిస్తుంటారు. కార్తీక మాసంలో ప్రతి ఏడాది శివాలయానికి వెళ్లి ఆలయ ఆవరణలో శివనామ స్మరణ చేస్తూ 363 ఒత్తులు వెలిగిస్తారు. సూర్యోదయానికి ముందు ఇంట్లో పూజలు చేసి ఇంటి ఎదుట దీపాలు వెలిగిస్తారు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో పూజలు చేస్తే స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శివుని, వేంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష తీసుకుంటారు.
మట్టి దీపారాధనతోనే ముక్తి
కార్తీక మాసంలో మహిళలు వేకువ జామునే లేచి తలంటు స్నానాలు చేసి ఇంట్లో మట్టి దీపాలు వెలిగించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ నెలలో ఆలయాల్లో దీపాలు వెలిగించి తమ కుటుంబానికి అంతా మంచి జరగాలని పూజలు నిర్వహిస్తారు. ఇంటి ఆడపడుచులను పిలుచుకొని లక్ష్మి దీపారాధన చేస్తారు. మట్టి దీపారాధన చేస్తే ఎంతో ముక్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకని నాటి నుంచి మట్టి దీపంతుల్లోనే దీపారాధన కొనసాగుతోంది.
అన్నీ పవిత్ర దినాలే..
కార్తీక మాసంలో అన్నీ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ నెలలోని అన్ని రోజులు పవిత్రమైన దినాలు భావిస్తారు. ఈ నెలలో చేసే పూజలకు ఎంతో ప్రాధాన్యత చేకూరుతుంది.
ప్రారంభమైన కార్తీకమాసం
మహిళల ప్రత్యేక పూజలు
నోములు, వ్రతాలకు ప్రత్యేకత
సోమవారానికి ఎంతో విశిష్టత
ఆలయాల్లో నెలకొన్న సందడి
Comments
Please login to add a commentAdd a comment