నిజామాబాద్ సిటీ: రైతు సమస్యల పరిష్కారం ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులకు చట్టబద్ధత కల్పించి వాటిని అమలుచేయడంతోనే సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఎల్‌ఎన్ గార్డెన్‌లో కొనసాగుతున్న రైతు సంఘం మహాసభలు గురువారం ముగిశాయి. సమావేశంలో నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. పలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని పోడు భూములకు, సాదా బైనామా దరఖాస్తు దారులకు పట్టాలు ఇచ్చి, పంటలకు పంటల బీమా పథకం ఏర్పాటు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు సరఫరాచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు సుధాకర్, ఓమయ్య, వార్ల వెంకటయ్య, కె గోవింద్, కంబాల శ్రీనివాస్, కొల్లూరి రాజయ్య, ప్రభు లింగం, రామచంద్రం, దేవీదాస్, సారంగపాణి, బొల్లు ప్రసాద్, రాజేశ్, దొండపాటి రమేశ్ పాల్గొన్నారు.


