అక్రమ తవ్వకాలు.. అడ్డుకుంటే దాడులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాలు.. అడ్డుకుంటే దాడులు

Apr 3 2025 1:32 AM | Updated on Apr 3 2025 1:32 AM

అక్రమ తవ్వకాలు.. అడ్డుకుంటే దాడులు

అక్రమ తవ్వకాలు.. అడ్డుకుంటే దాడులు

డిచ్‌పల్లి: మొరం, ఇసుక అక్రమ రవాణాదారులు చెలరేగిపోతున్నారు. గోరంత అనుమతులు తీసుకొని కొండంత మొరం తవ్వకాలు సాగిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనుకాడడం లేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకుంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మొరం, ఇసుక రవాణా అనుమతులు తీసుకుంటున్నారు. మొదట రోజుకు 5 నుంచి 10 టిప్పులు రవాణా చేసేందుకు డీడీలు చెల్లించి వే బిల్లులు తీసుకుంటారు. ఆ తర్వాత రోజంతా 40 నుంచి 50 ట్రిప్పులు మొరం తరలిస్తున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని డిచ్‌పల్లి మండలంలోని నలుగురు వ్యాపారులు రెవెన్యూ అధికారుల నుంచి మొరం తరలింపు కోసం అనుమతులు తీసుకున్నారు. వీరిలో ఇద్దరు రోజుకు 9 టిప్పర్ల ద్వారా 18 ట్రిప్పులు, మరో ఇద్దరు 4 టిప్పర్ల ద్వారా 8 ట్రిప్పులు మొరం రవాణాకు అనుమతి పొందారు. అయితే అనుమతికి మించి మొరం రవాణా చేపడుతున్నారు. వే బిల్లులను తనిఖీ చేసే వారు లేకపోవడంతో ఒకే బిల్లుపై కనీసం 10 ట్రిప్పులు సరఫరా చేస్తుంటారు. కొద్ది రోజులుగా పగటి పూటే కాకుండా రాత్రిళ్లు కూడా మొరం అక్రమ రవాణా జోరుగా కొనసాగిస్తున్నారు.

అడ్డుకుంటే బెదిరింపులు

ఇటీవల డిచ్‌పల్లి ఖిల్లా గ్రామానికి చెందిన రైతులు మొరం టిప్పర్ల రాకపోకలతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని టిప్పర్లను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో మొరం తవ్వకాలు జరుగుతున్న స్థల యజమాని టిప్పర్లను అడ్డుకుంటే వాటిని మీపైకి ఎక్కించాల్సి ఉంటుందని బెదిరించాడంటూ వీడీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరువక ముందే రెండు రోజుల క్రితం మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో అర్ధరాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీస్‌ సిబ్బంది మొరం తరలిస్తున్న టిప్పరును ఆపి వేబిల్లు అడిగారు. దీంతో టిప్పర్‌ డ్రైవర్‌ అదే గ్రామానికి చెందిన యజమానికి ఫోన్‌ చేయడంతో అక్కడికి చేరుకున్న యజమానికి పోలీసులతో గొడవ పడడమే కాకుండా దాడి చేశాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు, వారి ఆదేశాలతో మొరం టిప్పర్లను స్టేషన్‌కు తరలించారు. పోలీసులపై దాడికి పాల్పడిన ననేష్‌ అలియాస్‌ బాబీపై బీఎన్‌ఎస్‌ 303 క్లాజ్‌ 2, 132, 121 క్లాజ్‌ 1, 351 క్లాజ్‌ 2, 3 ఆఫ్‌ పీడీ పీపీ యాక్ట్‌, సెక్షన్‌ 21 క్లాజ్‌ 1, ఎంఎం డీఆర్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. టిప్పర్‌ డ్రైవర్‌ నాగేశ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు డిచ్‌పల్లి ఎస్సై ఎండీషరీఫ్‌ తెలిపారు. టిప్పర్‌ యజమాని ననేశ్‌ అలియాస్‌ బాబీని బుధవారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ కే మల్లేశ్‌, ఎస్సై–2 సత్యం తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారిపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, చోరీ చేయడం నేరమని పేర్కొన్నారు.

జోరుగా మొరం అక్రమ రవాణా

రాజకీయ అండతో దాడులకూ వెనుకాడని వైనం

పెట్రోలింగ్‌ పోలీసులపై దాడి..

కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement