అంబేడ్కర్ ఆలోచనలను సమాజానికి అందించాలి
తెయూ(డిచ్‌పల్లి): ప్రపంచ మేధావి అంబేడ్కర్ ఆలోచనలను పూర్తిస్థాయిలో సమాజానికి వర్తింపజేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి నేతృత్వంలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలో సామాజిక న్యాయం– విద్య, యువత సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లింబాద్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారత పౌరులు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ఎన్నికలు, రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పని విధానాలు ఆవిష్కరించబడి అవి భారత ప్రజలను సమున్నతులుగా మార్చినట్లు తెలిపారు. ఇది కేవలం అంబేద్కర్ రచించిన అత్యుత్తమ రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందన్నారు. తెయూ వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రిజిస్ట్రార్ యాదగిరి, వర్సిటీ ప్రిన్సిపాల్ ప్రవీణ్, డీన్ ఘంటా చంద్రశేఖర్, అధ్యాపకులు కనకయ్య, మోహన్ బాబు, సంపత్, స్వప్న, కిరణ్ రాథోడ్ పాల్గొన్నారు.
బెటాలియన్‌లో..
డిచ్‌పల్లి: మండల పరిధిలోని ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌లో సోమవారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమాండెంట్ ఏడుకొండలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీపీ కార్యాలయంలో..
ఖలీల్‌వాడి: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి సీపీ సాయిచైతన్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన అపార మేధాశక్తులతో సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు పాటుపడిన మహనీయుడన్నారు. అగ్రవర్ణాల దాడులకు గురైన బాధితులకు సత్వరన్యాయం అందించుటకు ‘ పోలీస్ శాఖ‘ నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ రాణి, రిజర్వు సీఐలు శేఖర్ బాబు, శ్రీనివాస్, తిరుపతి, సతీష్ పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆలోచనలను సమాజానికి అందించాలి


