రజతోత్సవ సభపై విస్తృత ప్రచారం
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఈనెల 27వ తేదీన సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం తరహాలో విస్తృతంగా వాల్‌రైటింగ్ చేయిస్తున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జనం ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో వాల్ రైటింగ్‌ను చేయించారు. ఎన్నికల్లో వాల్ రైటింగ్ చేయాలంటే ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇవి సాధారణ రోజులు కాబట్టి ఇంటి యజమాని అనుమతితో వాల్ రైటింగ్‌ను నిర్వహిస్తున్నారు. వేల్పూర్‌లో చేసిన వాల్ రైటింగ్‌ను ఇటీవల బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. అలాగే సభకు జనంను ఎక్కువగా తరలించడానికి కార్యకర్తలు కుల సంఘాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల ప్రచారం తలపించేలా వాల్ రైటింగ్ చేయిస్తుండటంపై పలువురు చర్చించుకుంటున్నారు. – మోర్తాడ్


