
బీజేపీలో టిక్కెట్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎ న్నికల నేపథ్యంలో బీజేపీలో టిక్కెట్ల పంచాయితీ నెలకొంది. తమకు టిక్కెట్టు వస్తుందంటే.. తమ కు హామీ దక్కిందంటూ పలువురు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు చెప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల నుంచి తమకు ఇప్పటికే హామీ లభించిందంటూ ప్ర చారం చేసుకుంటుండడంతో పలువురు నాయకుల మధ్య కోల్డ్‌వార్ మాదిరి పంచాయితీ నెలకొంది. దీంతో ఈ విషయం రాష్ట్ర పార్టీ వరకు చేరింది. కీలకమైన నిజామాబాద్ జిల్లాలో స్థానిక టిక్కెట్ల కేటాయింపు విషయమై రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్యేకంగా దృష్టి సారించడం గమనార్హం.
గెలుస్తామనే ఆశతో...
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీలో స్థానిక సంస్థల టిక్కెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. వరుసగా రెండుసార్లు లోక్‌సభ సీటు గెలవడం, ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలవడంతోపాటు గ్రామాల్లో పార్టీ మరింత బలోపేతం కావడంతో టిక్కెట్లకు డిమాండ్ పెరిగింది. పైగా గ్రామాల్లో యువత పార్టీకి దన్నుగా నిలబడుతుండడంతో గెలుస్తామనే ఆశతో పలువురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎవరికి వారే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పట్టుపడుతున్నారు. అయితే సదరు నియోజకవర్గాల నాయకులు తమ అనుచరులకు టిక్కెట్లు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చేరడంతో టిక్కెట్ల కేటాయింపు అనేది ఏ ఒక్క నాయకుడి చేతిలో ఉండదని, కోర్ కమిటీ ఎంపికలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో టిక్కెట్టు హామీ వచ్చిందంటూ సంతోషపడితే కుదరదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కీలక నేత మనసులో ఏముందో అనే అంతర్గత చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై నోటిఫికేషన్ జారీ చేసే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయినప్పటికీ ముందే కమలం పార్టీలో టిక్కెట్ల కుస్తీ నడుస్తుండడంతో వ్యవహారం రసకందాయంగా మారింది.
ఆశావహుల్లో టెన్షన్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు జిల్లాలో పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు మాత్రం, తమకు టిక్కెట్టు విషయమై హామీ వచ్చిందంటూ పలుచోట్ల చెప్పుకుంటున్నారు. అయితే ఇలా చెప్పుకుంటున్న నాయకులకు మాత్రం కీలక నాయకత్వం నుంచి ఝులక్ వచ్చింది. క్రమశిక్షణ కలిగిన బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు కోర్ కమిటీ చేతిలో ఉంటుందని, కోర్ కమిటీ తయారు చేసిన ఆశావహుల జాబితా మేరకు అన్ని కోణాల్లో పరిశీలించి రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ చేశాకే టిక్కెట్టు దక్కుతుందని పార్టీ శ్రేణులకు మెసేజ్ పాస్ అయింది. దీంతో తమకే టిక్కెట్టు అని చెప్పుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
స్థానిక సంస్థల్లో కమలం తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల పాట్లు
హామీ వచ్చిందంటూ చెప్పుకుంటున్న పలువురు నాయకులు
కోర్ కమిటీ ఆమోదిస్తేనే టిక్కెట్లని
తేల్చి చెప్పిన రాష్ట్ర నాయకత్వం