
వాకింగ్‌కు వెళ్లి అనంతలోకాలకు..
● చెరువులో పడి
పదో తరగతి విద్యార్థి మృతి
● హాస్టల్ నుంచి వచ్చిన
మరుసటి రోజే ఘటన
మద్నూర్(జుక్కల్): దసరా పండుగకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి మరుసటి రోజే దుర్మరణం చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లారలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొద్దిసేపటికే చెరువులో పడి చనిపోయాడన్న వార్త తల్లిదండ్రులు, గ్రామస్తులను శోకసంద్రంలో ముంచింది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన సంజు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజుకి ఒక కూతురు, కొడుకు సాయిచరణ్(15) ఉన్నారు. సాయిచరణ్ మద్నూర్‌లోని బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండటంతో ఆదివారం ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం వాకింగ్ చేసి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన సాయిచరణ్ గ్రామ శివారులో ఉన్న చెరువులో శవమై కనిపించాడు. కాలకృత్యాల కోసం వెళ్లిన సాయిచరణ్ ప్రమాదవశాత్తు చెరువులో ఉన్న పెద్ద గుంతల్లో పడటంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయ్‌కొండ తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడు..
బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్‌పల్లి గ్రామానికి చెందిన మహ్మద్(35) అనే యువకుడు సోమవారం విద్యుదాఘాతంతో మరణించాడు. బీర్కూర్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. గమనించిన తోటి కార్మికులు మహ్మద్‌ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యు లు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ అశోక్ తెలిపారు.

వాకింగ్‌కు వెళ్లి అనంతలోకాలకు..