వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయే..
బోధన్: విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించి, నూతన ఆవిష్కరణలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఈ ఏడాది బోధన్ పట్టణంలోని విజయమేరి హైస్కూల్ వేదిక కానుంది. ఆదివారం నుంచి ఈ నెల 25 వరకు కొనసాగే సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల యాజమాన్యాలు, గైడ్ టీచర్లకు ఎగ్జిబిషన్ మార్గదర్శకాలు, నిబంధనలు, సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సమాచారం అందించారు.
పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు మాత్రమే..
సైన్స్ ఎగ్జిబిషన్‌కు స్వయం సమృద్ధి భారత దేశం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలైన సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం ప్రధాన అంశంగా ఎంపిక చేశారు. ఇందులో పేర్కొన్న ఏడు ఉప అంశాలైన సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్ధాల నిర్వహణ మరియు ప్రత్యామ్నాయ ప్లాస్టిక్, హరితశక్తి(పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదభరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత, నీటి సంరక్షణ మరియు నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉంటాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, బీఎడ్, డీఎడ్ ట్రెయినీ విద్యార్థులు కూడా నూతన ఆవిష్కరణలతో కూడిన బోధన అభ్యాసనా సామగ్రిని ప్రదర్శనకు అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల నుంచి సైన్స్ ఎగ్జిబిషన్‌కు 550 ప్రాజెక్టులను నమోదు చేసుకున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లో జూనియర్ విభాగంలో 6 నుంచి 8 వతరగతి వరకు, సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఉప అంశానికి ఒకరు చొప్పున ప్రాజెక్టులను ప్రదర్శించాలి. ఒక పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులు మాత్రమే ప్రదర్శనకు అవకాశం కల్పిస్తూ నిబంధన విధించారు. పాఠశాల నుంచి ఒక గైడ్ టీచర్ మాత్రమే పాల్గొనాలి.
జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శన(2024–25)ను కూడా జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్(2025–26)తో పాటు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇన్‌స్పైర్(2024–25)లో జిల్లాస్థాయికి ఎంపికై న 119(ప్రాజెక్టులు) మంది విద్యార్థులు సైతం ఇందులో పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థుల ఖాతాల్లో రూ. పదివేల చొప్పున అధికారులు డబ్బులు జమ చేశారు.
మూడు రోజుల పాటు..
ఎగ్జిబిషన్ తొలి రోజు ఆదివారం మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టులు, పాఠశాల పేర్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. రెండో రోజు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం, ప్రాజెక్టుల ప్రదర్శనతో పాటు సాయంత్రం ప్లాస్టిక్ కా లుష్యాన్ని తగ్గించడం అనే అంశం పై ప్రత్యేక సె మినార్ నిర్వహించనున్నారు. ఆఖరి రోజు ప్రా జెక్టుల ప్రదర్శనతో పాటు ముగింపు వేడుకలు ఉంటాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, వీరితో పాటు ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ఎగ్జిబిషన్‌కు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పర్యవేక్షణలో అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్టు జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ వెల్లడించారు.
నేటి నుంచి బోధన్ విజయమేరి హైస్కూల్‌లో నిర్వహణ
ప్రధాన అంశంతో పాటు ఏడు
ఉప అంశాల్లో 550 ప్రదర్శనలు
ప్రారంభించనున్న ప్రభుత్వ
సలహాదారు, కలెక్టర్


