తానా ప్రపంచ సాహిత్య వేదిక 15వ “తెలుగుతనం-తెలుగుధనం” సదస్సు ఘన విజయం | Tana World Literary Forum 15th Telugu Tanam Telugu Danam Conference was Successful | Sakshi
Sakshi News home page

తానా ప్రపంచ సాహిత్య వేదిక 15వ “తెలుగుతనం-తెలుగుధనం” సదస్సు ఘన విజయం

Published Tue, Jul 27 2021 9:33 PM | Last Updated on Tue, Jul 27 2021 9:46 PM

Tana World Literary Forum 15th Telugu Tanam Telugu Danam Conference was Successful - Sakshi

అట్లాంటా, జూలై 26: తానా ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాలంలో ఆదివారం నిర్వహించిన “తెలుగుతనం–తెలుగుధనం” అనే సాహిత్య కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ.. గత సంవత్సరం మే నెలలో సాహిత్యవేదిక ఆవిర్భావం నుంచి 15 నెలలుగా వివిధ సాహిత్యాంశాలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలతో ప్రపంచ వేదిక మీద సాహితీ సౌరభాలను గుభాళింప చేయగల్గడం చాలా ముదావహం అన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన ప్రారంభ ఉపన్యాసంలో తెలుగు భాష, సాహిత్య పరిరక్షణ కోసం, భావితరాలకు భద్రంగా అందించే కృషిలో తానా కట్టుబడి ఉందని, తన పదవీకాలం లో తానా ప్రపంచ సాహిత్య వేదికను మరింత ఎత్తుకు తీసుకు వెళ్ళడానికి తాను, తన కార్యవర్గం సిద్ధంగా ఉందని అన్నారు.

తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనాటి సాహిత్య కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైనదని, పాల్గొంటున్న అతిధులందరూ వారి వారి రంగాలలో ఆరి తేరినవారని అందరికీ స్వాగతం పలికారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. విశిష్ట అతిధిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు గారు తన వ్యక్తిగతజీవితంలో ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని ఈనాడు ఉన్నత స్థితిలో భాద్యతాయుత పదవిలో ఉండడం తెలుగు వారికి ఎంతో స్పూర్తిదాయకం అన్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు 1954లో సాహిత్య అకాడమీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు సాహిత్య అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరిస్తూ 24 భాషల్లో విశేష కృషి చేస్తున్న వారికి వివిధ పురస్కారాలు, సాహిత్య ప్రచురణలు, సమావేశాలతో నిరంతరం కృషి చేస్తోందని, తెలుగు భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించే అనువాదకులు తక్కువగా ఉన్నారని, ఎక్కువ మంది ముందుకు వస్తే తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి చేరడం సులభం అవుతుందని అన్నారు.

లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత విశేషాలను వివరిస్తూ వీడియో ఫిలిమ్స్ తెలుగు కవుల మీద తక్కువగా ఉన్నాయని ఆ దిశలో ఇంకా ఎక్కువ కృషి జరగాలనీ, సాహిత్య అకాడమీ వెబ్సైటులో మన తెలుగు భాషలో కొన్ని పేజీలు ఉండాలని, అవి రూపొందించే దిశలో దానికి కావలసిన సాంకేతిక సహకారం అందించడానికి తానా సంసిద్ధంగా ఉన్నదని డా. తోటకూర తెల్పినప్పుడు డా. కృతివెంటి సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీతో కలసి తానా ప్రపంచ సాహిత్యవేదిక ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయవచ్చని ఆహ్వానించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ తెలుగు వేదకవి, సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి “పాట-పద్యం–పేరడీ–ప్రశ్న” అనే అంశంపై రెండు గంటలపాటు సాగిన సాహిత్య ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో, ఆలోచనలు రేకెత్తిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

కవి జొన్నవిత్తుల కలం నుండి వెలువడిన ఎన్నో సినీ గీతాలలో కొన్నింటిని.. ఉదాహరణకు: పూర్తి సంస్కృతంలో రాసిన డిస్కో గీతం, స్వప్త స్వరాలపై రాసిన గీతం, భద్రాద్రి రాముడి తో సహా అందరి దేవుళ్ళమీద రాసిన గీతాలు, తెలుగు భాష వైభవంపై రాసిన గీతాలు, టోక్యో ఒలింపిక్ పోటీల సందర్భంగా జపాన్ దేశంలో సూర్య నమస్కారాలు చేస్తుండడంపై స్పందించి రాసిన పాట, తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం నిర్వహించే భారతదేశ స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకల కోసమై రాసిన పాటను, మరి కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాసిన పాటలను ప్రేక్షకులతో పంచుకోగా అందరూ హర్షద్వానాలు పల్కారు.

అక్షర నాదం, స్వరనాదం రెండూ ఏకీకృతమై వ్యక్తమయ్యే పద్య రసభావన శ్రోతలను ఆకట్టుకొని వారి మనసులను రంజిల్లింప చేసే శక్తి పద్యాలకుందని అందుకే అవి అందర్నీ ఆకర్షిస్తాయన్నారు. వివిధ సినిమాల కోసమై రాసిన ఘటోత్కచుడు మీద, పాండవుల మీద, రావణాసురుడు మీద, యముడు మీద పద్యాలు, దుబాయ్ దేశం పర్యటించినపుడు వారి సంస్కృతిలో భాగమైన బెల్లి డాన్స్ చూసినప్పుడు మరియు సింగపూర్ దేశంలో రోప్ వే పై ప్రయాణించినప్పుడు కల్గిన స్పందనతో రాసిన పద్యాలు, దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, ఎన్.టి. రామారావు, అక్కినేనిలపై రాసిన పద్యాలను రాగయుక్తంగా పాడగా అవి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

సమకాలీన సామాజిక రాజకీయాలలో పార్టీ మార్పిడ్లు, రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య ధోరణితో పాడిన పేరడీ పాటలు కవి జొన్నవిత్తుల సామాజిక స్పృహను, యదార్థ స్థితిని గొప్పగా ఆవిష్కరించాయి. ప్రశ్నా విభాగంలో గత 75 సంవత్సారాల కాలంగా భారతదేశం సాధించిన ప్రగతి, కోల్పోయిన మానవీయ సంబంధాలపై స్పందించమన్నపుడు ప్రస్తుతం కావల్సింది సత్యం, ధర్మం, త్యాగం అనే లక్షణాలు కల్గిన సుపరిపాలన ప్రజలకందించేది నాయకులని అలాంటి వారిని ప్రజలు ఎన్నుకోనంత వరకు దేశం పురోగతి సాధించజాలదని హితవు పల్కారు.

ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డా. ఎర్రాప్రగడ రామకృష్ణ - మాట్లాడడం ఒక కళ అని, మనం మాట్లాడే మాటలు పలువుర్ని ఆకట్టుకునే విధంగా ఎలా ఉండాలి, ఒకే మాట పలు ప్రాంతాలలో ఎలాంటి విపరీతమైన అర్ధాలకు దారి తీస్తుంది, కొంచెం శ్రద్ధ వహిస్తే అందరూ బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని “మాట తీరు” అనే అంశంపై అద్భుతంగా ప్రసంగించారు. తానా ఉత్తరాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ ఘన చరిత్ర కల్గిన తెలుగు భాష, సాహిత్య వైభవాలను పరిరక్షించి పర్వ్యాప్తి చేయడం, తెలుగు కవులు, కళాకారులను ఆదరించడం లో తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, తానా ప్రపంచ సాహిత్య వేదికను బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న వారందరికీ, హాజరైన అతిధులకు, ప్రసారం చేసిన వివిధ ప్రసార మాధ్యమాల వారికి, వీక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement