బెదిరేది లేదు.. వైఎస్సార్‌ సీపీని వీడేది లేదు | - | Sakshi
Sakshi News home page

బెదిరేది లేదు.. వైఎస్సార్‌ సీపీని వీడేది లేదు

Apr 2 2025 1:23 AM | Updated on Apr 2 2025 1:23 AM

బెదిరేది లేదు.. వైఎస్సార్‌ సీపీని వీడేది లేదు

బెదిరేది లేదు.. వైఎస్సార్‌ సీపీని వీడేది లేదు

చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా.. మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా.. భయ పడేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. బందరులోని తన నివాసం వద్ద ఆయన మంగళవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వినియోగించకుండా రాజకీయంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేసేందుకు వాడుతోందని విమర్శించారు. బియ్యం సరఫరా కేసులో తమకే పాపం తెలియదని పోలీసులు, న్యాయవ్యవస్థకు తెలిసినప్పటికీ, ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కోర్టులో వారు మోపిన చట్టం ఈ కేసులో చెల్లదని న్యాయమూర్తులు చెప్పినప్పటికీ వేధింపులే లక్ష్యంగా హైకోర్టులో తన భార్య బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేశారన్నారు.

క్రిమినల్‌ కేసులు ఎలా వేస్తారు?

పౌరసరఫరాలశాఖ ఏర్పడినప్పటి నుంచి బియ్యం సరఫరాల్లో జరిగిన అక్రమాలపై 6ఏ కేసులు నమోదు తప్ప ఇంత వరకు ఎవరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయలేదని పేర్ని నాని అన్నారు. సాక్షాత్తూ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కాకినాడ పోర్టులో 20 వేల టన్నుల బియ్యం అక్రమ రవాణాను పట్టుకున్నప్పుడు కూడా 6ఏ కేసు తప్ప క్రిమినల్‌ కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. కేవలం తమను వేధించడానికే కక్షతో దిగజారుడుతనంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో వేధింపులే పై చేయి సాధిస్తే.. తమ కుటుంబమంతా జైలుకెళ్లి వస్తామే తప్ప, వైఎస్సార్‌ సీపీని వీడేది లేదని పేర్ని నాని స్పష్టం చేశారు.

కాకినాడ పోర్టులో బియ్యం తరలించినా క్రిమినల్‌ కేసులు పెట్టలేదు కేవలం కక్షసాధింపు కోసమే మాపై క్రిమినల్‌ కేసులు పెట్టారు మాజీ మంత్రి పేర్ని నాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement