భువనేశ్వర్: అధికారులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ, పూరీ జగన్నాథ ఆలయం లోపలి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. తరచూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. నిఘా వ్యవస్థ లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు ఆలయ భద్రత వ్యవస్థ పటిష్టతకు సవాల్‌గా నిలుస్తున్నాయి. శ్రీమందిరం లోపలికి సెల్‌ఫోన్లు, కెమెరాలు ఇతరేతర సాంకేతిక పరికరాలు, యంత్రాల ప్రవేశం పూర్తిగా నిషేధం. ఈ నేపథ్యంలో సింహద్వారం ఆవరణలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించి, లోపలికి ప్రవేశించేందుకు అనుమతించే విధానం అమలులో ఉంది.
ఈ వ్యవస్థ కార్యచరణ లోపంతో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి శ్రీమందిరం ప్రధాన దేవస్థానం లోపలి దృశ్యాలను వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పరిస్థితులు తీవ్ర కలకలం రేపి, విశిష్ట మందిరం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలకు అవకాశం కల్పిస్తున్నాయి. వీడియోలో తారసపడిన వ్యక్తి స్థానికేతరుడుగా భావిస్తున్నారు. ఈ దృశ్యాల్ని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసి, విడుదల చేయడంతో వివాదం ఊపందుకుంది. దీని ప్రకారం వివాదాస్పద యాత్రికుడు వారణాసికి చెందిన వ్యక్తి రోహిత్ జైస్వాల్‌గా గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్లు నిషేధించినా.. తనతో పరికరాన్ని ఎలా తీసుకు వెళ్లడనే దానిపై అనుబంధ వర్గాలు తక్షణమే స్పందించలేని దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నాయి.
స్వామివారు లేని సమయంలో..
తోబుట్టువులతో కలిసి జగన్నాథుడు గుండిచా మందిరానికి యాత్రగా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలో నిత్యం కళకళలాడే శ్రీమందిరం బోసిబోయింది. మరమ్మతులు తదితర నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. అయితే యాత్రికులు శ్రీమందిరం సందర్శించేందుకు ఎటువంటి ఆంక్షలు లేకున్నా.. భద్రతాపరమైన కార్యాచరణ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. మూల విరాట్‌లు లేనందున శ్రీమందిరం సందర్శనకు నామమాత్రపు యాత్రికులు మాత్రమే సందర్శిస్తున్నారు.
జనసందోహం లేని ఈ వ్యవధిలో భద్రత, తనిఖీ కార్యకలాపాలు మందగించే నిర్లక్ష్య పరిస్థితులను యాత్రికుడు అనుకూలంగా చేసుకొని, లోపలి దృశ్యాల చిత్రీకరణకు పాల్పడేందుకు వీలైందనే ఆరోపణ బలంగా వ్యాపించింది. రాత్రింబవళ్లు నిరవధికంగా కొనసాగాల్సిన భద్రతా వ్యవస్థ కార్యాచరణ పెద్ద సవాల్‌గా నిలిచింది. చర్యలలో అలసత్వం కారణంగా అతను ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడా? లేదా ఘటనలో ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా? అనే దానిపై స్పష్టత లేదు.
చర్చలేవీ..?
జగన్నాథ దేవాలయం లోపలి దృశ్యాల వీడియోలు, చిత్రాలు ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టడం మినహా అవాంఛిత సంఘటనల పునరావృతం నివారణ దిశలో పూరీ జిల్లా, పోలీసు, జగన్నాథ ఆలయ పాల క వర్గం ఇతర అనుబంధ వర్గాలు చేపట్టిన చర్యలు శూన్యంగా పరిణమించాయి. లోపలి దృశ్యాల చిత్రీకరణ వివాదస్పద కార్యకలాపాల్లో బాధ్యులైన సిబ్బంది, అధికార వర్గాల వ్యతిరేకంగా చేపట్టిన చర్యల దాఖలాలు లేకపోవడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment