జయపురం: స్థానిక సదర్ పోలీసుస్టేషన్ పరిధి అంబాగుడ పోలీసు పంటి సబ్ ఇన్‌స్పెక్టర్ రూ.5 వేల లంచం తీసుకుంటూ విజిలెన్స్ వలలో చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత కుమార్ మహంతి జయపురం సదర్ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఒక కేసులో ఒక వ్యక్తికి సహకరించేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంపై బాధిత వ్యక్తి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయగా, ఒడిశా విజిలెన్స్ టీమ్ ఎస్‌ఐ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. అలాగే అనంతరం ఎస్‌ఐ ప్రభుత్వ నివాసంపై, ధమంజొడిలోని అతడి అద్దె ఇంటిపై, కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
పర్లాకిమిడి: విశాఖపట్నం–గుణుపురం ట్రైన్‌లో సోమవారం ప్రయాణిస్తున్న బర్నాల రవిబాబు(50) కాశీనగర్ స్టేషన్ వద్ద దిగుతుండగా కాలుజారి పడడంతో, దురదృష్టవశాత్తు ఆయన రెండు పాదాలు తెగిపోయాయి. వెంటనే క్షతగాత్రుడుని పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం డాక్టర్లు పరీక్షించి గాయం తీవ్రంగా ఉండడంతో బరంపురం ఆస్పత్రికి తరలించారు. కాశీనగర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
గంజాయి స్వాధీనం
● ముగ్గురు అరెస్టు
రాయగడ: జిల్లాలోని రామనగుడ పోలీసులు ఆదివారం నిర్వహించిన దాడుల్లో 73 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారు గజపతి జిల్లా ఒడవా ప్రాంతానికి చెందిన రమాకాంత్ నాయక్ (36), ప్రదీప్ చంద్ర నాయక్(37), మున్నా బెహర (23)లుగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రామనగుడ ఎస్‌ఐ పృధ్వీరాజ్ జంకార్ నేతృత్వంలో రామనగుడ పోలీసుస్టేషన్ పరిధిలోని చకుండా కూడలిలో ఆదివారం ఉదయం వాహన తనికీలను నిర్వహించారు. ఈ క్రమంలో గజపతి జిల్లా ఒడవా నుంచి ఒక వాహనంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తుండగా గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు తరలించారు.
సప్లిమెంటరీలో
33 శాతం ఉత్తీర్ణత
భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు (బీఎస్‌ఈ) ఆధ్వర్యంలో జరిగిన హైస్కూల్ సర్టిఫికెట్ (హెచ్‌ఎస్‌సీ) 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం ప్రకటించారు. ఫలితాలు బోర్డు అధికారిక వెబ్‌సైట్ www. bseodisha.ac.in అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలకు హాజరైన 1,310 మంది విద్యార్థుల్లో 433 మంది ఉత్తీర్ణులయ్యారు. 360 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే స్టేట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసిన 8,920 మంది విద్యార్థుల్లో 6,778 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 525 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరు కాగా, 49 మంది మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయినట్లు బీఎస్‌ఈ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment