
నది వంతెనపై వేలాడుతున్న బస్సు
భువనేశ్వర్: ఓ వైపు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మహా నది. మరోవైపు నది వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు. ఏమైందో గానీ ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి కాంక్రీట్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. బస్సు ముందుభాగం గాల్లో తేలింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక, స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసు బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సురక్షితంగా బస్సును యథాస్థితికి తీసుకొచ్చారు.
దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కటక్ జిల్లా బంకీ ప్రాంతం మహా నది వంతెనపై మంగళ వారం ఈ ఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయడినట్లు తెలిసింది. సాంకేతిక లోపం ప్రమాదానికి దారితీసి ఉంటుందని, ఈ విషయమై డ్రైవర్‌ను ప్రశ్నిస్తామని పోలీసు అధికారి తెలిపారు.
డ్రైవరుదే పొరపాటు..
బంకీ మహానది వంతెనపై బస్సు ప్రమాదం ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాంతీయ రవాణా శాఖ ఈ దర్యాప్తు చేపట్టింది. బస్సు ఫిట్‌నెస్, పర్మిట్ వ్యవహారంలో ఎటువంటి లోటు లేదని, డ్రైవరు తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాంతీయ రవాణా విభాగం అధికారి సంజయకుమార్ బెహరా తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక డ్రైవరుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment