మజ్జి శ్రీనివాసరావు
సామాజిక పింఛన్ల పంపిణీలో సచివాలయ వ్యవస్థ విజయం
సకాలంలో పింఛను అందించి లబ్ధిదారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భరోసా
జగన్‌మోహన్‌రెడ్డికి పేరు రాకూడదనే వలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు అడ్డంకులు
వైఎస్సార్‌సీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి ఐదేళ్లుగా పింఛను అందిస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ‘పచ్చ’కుట్రలు పటాపంచలయ్యాయని వైఎస్సార్‌సీపీ డిప్యూటీ రిజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. వలంటీర్ల వ్యవస్థను అడ్డకున్నా సామాజిక పింఛన్లను సకాలంలో అందించి సచివాలయ వ్యవస్థ విజయం సాధించిందని ప్రశంసించారు.
‘వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛనుగా అందిస్తూ వస్తోంది. వారి జీవనానికి ఒక భరోసా కల్పించింది. ఈ విధానం అనేక దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించింది. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేయడానికి సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక బృందాలొచ్చి అధ్యయనం చేశాయి.
ఇదెక్కడ జగన్‌మోహన్‌రెడ్డికి పేరొస్తుందోనన్న అసూయతో చంద్రబాబు కుతంత్రాలకు ఆదిలోనే తెరలేపారు. వలంటీర్ల వ్యవస్థపై బురదజల్లారు. కించపరిచేలా దుర్భాషలాడారు. ఇవేవీ పట్టించుకోకుండా వలంటీర్లు సేవాదృక్ఫథంతో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచేయడానికి కష్టపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఇదే చంద్రబాబు హైదరాబాద్ ప్యాలెస్‌లో తాళాలేసుకొని కూర్చుంటే వలంటీర్లు ఇక్కడ ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా నిలిచారు.
వైద్యసేవలు సత్వరమే అందించడానికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రినని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో సృష్టించిన జన్మభూమి కమిటీలు ప్రభుత్వ సేవలందించే ముసుగులో తమ ప్రాణాలు ఎలా తోడేశాయో ప్రజలకు బాగా తెలుసు. అందుకే 2019 సంవత్సరంలో టీడీపీని తరిమికొట్టారు. జన్మభూమి కమిటీలకు ఎంతో భిన్నంగా ఉన్న వలంటీర్లను చూసి చంద్రబాబు కక్ష కట్టారు.
నిమ్మగడ్డ రమేష్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛను అందించకుండా వలంటీర్లను దూరం చేశారు. ఇలా ఒక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రకు తెరలేపారు. ఇది దురదృష్టకరం. చంద్రబాబు చేష్టలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కచ్చితంగా బుద్ధి చెబుతారు.
జగన్ విజన్‌కు నిదర్శనం...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌కు నిదర్శనం. ప్రతి సచివాలయంలో 11 మంది ఉద్యోగులను, గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు, పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను పెట్టారు. ప్రభుత్వ సేవలను, పథకాలను పైసా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా అందించిన వ్యవస్థగా పేరొందింది. దీన్ని చెడగొట్టడానికి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. వృద్ధులు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛను ఇంటివద్దనే అందుకోకుండా సైంధవుడిలా అడ్డుపడ్డారు.
మండుటెండల్లో రోడ్లపైకి లాగి చంద్రబాబు తనలోనున్న సైకో మనస్తత్వత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఏదిఏమైనా సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం హర్షణీయం. సచివాలయ ఉద్యోగులకు అభినందనలు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయాల్లో కల్పించిన దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను ఇన్నాళ్లూ గుర్తించని చంద్రబాబే ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలన్నారంటేనే ప్రజాసేవ పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో చాటిచెబుతోంది. వలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్న చంద్రబాబే తమ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఖజానాలో డబ్బుల్లేవని, అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని దుష్ప్రచారం చేశారు. కానీ లబ్ధిదారులందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేసి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment