పోలీసులు అందుబాటులో ఉండాలి
భువనేశ్వర్: ప్రజాసేవకు పోలీసుల 8 గంటల పని వేళలు పరిమితం కాదు. ఠాణాకు విచ్చేసిన ప్రతీ వ్యక్తికి రాత్రింబవళ్లు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీసు సూపరింటెండెంట్లని ఉద్దేశించి స్థానిక లోక్‌సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ప్రసంగించారు. రెండు రోజుల రాష్ట్రస్థాయి కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్ల సమావేశం శనివారంతో ముగిసింది. అర్ధరాత్రి పూటనైన ఠాణాకు విచ్చేసిన బాధితుడి గోడు క్షుణ్ణంగా ఆలకించి సత్వర భద్రత కల్పించాలని ప్రబోధించారు. ప్రధానంగా యువతులు, మహళలు, బాలలపై మరింత అప్రమత్తంగా మెసలుకుని అభయం ఇవ్వడం అనివార్యంగా పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం చూరగొనేందుకు ఇదే బలమైన సోపానంగా ప్రోత్సహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల రేటుపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులపై చర్యల పరిస్థితి అత్యంత శోచనీయంగా ఉంది. 2022 నాటి గణాంకాల ప్రకారం నేరాలపై శిక్ష అమలు రేటు నామమాత్రంగా 9.7 శాతానికి పరిమితం కావడంపై ముఖ్యమంత్రి పెదవి విరిచారు.
డీజీపీకి ఆదేశాలు
రాష్ట్రంలో విచారణలో కొనసాగుతున్న నేరాల కేసుల తాజా స్థితిగతుల్ని దాఖలు చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆదేశించారు. వారం రోజుల్లో కేసుల విచారణ, శిక్ష విధింపు, అమలు వగైరా అంశాలతో సమగ్ర సమాచారం దాఖలు కావాలన్నారు. మహిళలపై జిల్లాలవారీగా ఉన్న కేసుల వివరాలు, నేరారోపణలు, విచారణ కోసం పెండింగులో ఉన్న పూర్తి వివరాలు దాఖలు చేయాలని తెలిపారు. ఈ విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వం న్యాయ ప్రముఖులతో సంప్రదించి నేరస్తుల వ్యతిరేకంగా చట్టపరమైన చర్యల కోసం సన్నాహాలు చేస్తుందన్నారు. నేరాలు, శిక్ష సంబంధిత అంశాల్లో అందరిని సమానంగా పరిగణించి చట్ట పరిధిలో కఠిన శిక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేసేది లేదని హామీ ఇచ్చారు. మహిళల వ్యతిరేకంగా నేరాల కేసుల విచారణలో జాప్యం నివారించి సత్వర న్యాయం సకాలంలో అందజేయాలి. ఠాణాలకు విచ్చేసే మహిళలపై ఏమాత్రం అసభ్యతి సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
హోం గార్డుల పునః నియామకం
త్వరలో 2,298 మంది హోం గార్డులను పునః నియమించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫీల్డు డ్యూటీ కార్యకలాపాల కోసం ప్రస్తుతం ద్విచక్ర వాహనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో 4 చక్రాల వాహన సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. విధి నిర్వహణలో అకాల మరణానికి గురైన వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య కోటా కింద ఉద్యోగ అవకాశం కల్పించే దిశలో ప్రభుత్వ యోచిస్తుంది. ప్రతీ జిల్లాలో ఓడ్రాఫ్ బృందం ఏర్పాటు అవుతుంది. ఒడిశా రాష్ట్ర స్ట్రైకింగు ఫోర్సు కొత్తగా 3 బెటాలియన్లు ఏర్పాటు చేస్తుంది. పూరీ శ్రీ మందిరం భద్రతా అనుబంధ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బోధన ఆస్పత్రుల ప్రాంగణాల్లో భద్రతా వ్యవస్థ పటిష్టం అవుతుంది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలల ప్రాంగణంలో ఒక్కోటి చొప్పున పోలీసు ఔటు పోస్టు ఏర్పాటు అవుతుంది. స్థానిక బరముండా బస్టాండు ప్రాంగణంలో కొత్తగా పోలీసు ఔటు పోస్టు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఠాణాలో సబ్ ఇనస్పెక్టరు, సహాయ సబ్ ఇనస్పెక్టరు. ఇనస్పెక్టరు ఇంచార్జి కోసం ఒక్కో ద్విచక్ర వాహనం ఠాణాలో అందుబాటులోకి తెస్తారు.
సీఎం మోహన్‌చరణ్ మాఝీ
ముగిసిన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు
Comments
Please login to add a commentAdd a comment