జయపురం: ముఖ్యమంత్రి బస్సు సేవా పథకంలో భాగంగా జయపురం నుంచి ఏడు ఏసీ లక్ష్మీ బస్సులను బుధవారం ప్రారంభించారు. కొత్త బస్సులు జయపురం – గుణుపూర్, జయపురం– కాశీపూర్ వయా లక్ష్మీపూర్, జయపురం – మల్కన్‌గిరి, జయపురం – కొటియ, జయపురం – చందాహండి, జయపురం – భవానీపట్న, జయపురం – కొటాగాంకు వేశారు. ఒక్కొక్క బస్సులో 50 సీట్లు ఉంటాయని ఓఎస్‌ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. సర్వీసులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
మహిళల పాత్ర గురుతరమైనది
జయపురం: సహకార సంస్థల ప్రగతి, ఉద్యమంలో మహిళల పాత్ర గురుతమైనదని వక్తలు పేర్కొన్నారు. స్థానిక కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ సభా గృహంలో ‘సహకార సమృద్ధి – మహిళల భూమిక’పై బుధవారం వర్క్‌షాపు నిర్వహించారు. కేసీసీ బ్యాంక్ పరిచాలన కమిటీ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. సమాజంలో మహిళల ఆర్థిక, సామాజిక ఉన్నతి కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయని వివరించారు. సహకార ఆందోళనలో మహిళలు మమేకమైతే అది సమాజానికి మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. మహిళలు పశుపాలన, వ్యవసాయ యాజమాన్యంపై అవగాహన పొందాలని సూచించారు. అనంతరం పలు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు కేసీసీ బ్యాంకు రూ.5 లక్షల చొప్పున రుణాలు అందజేసింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సొశ్మిత మెలక, డీఆర్‌సీఎస్ భీమసేన్ సాహు, ఏఆర్‌సీఎస్ శొశానంద బెహర, డీఈవో కమల లోచన మఝి, ఏజీఎం హరిశ్చంద్ర బొనాగడి, కేసీసీ బ్యాంక్ డైరెక్టర్ రమాకాంత రౌలో పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
రాయగడ: తమ సమస్యలు పరిష్కరించాలని ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఫరూల్ పట్వారీని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ట్రాక్టర్లు నడుపుతున్నప్పటికీ, ప్రభుత్వ విధానాల వలన పూట గడవడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ గృహ, రహదారి నిర్మాణ పథకాలు కోసం ఇసుక, రాళ్లు వంటివి సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ, రాయల్టీ సరిగ్గా ఇవ్వడం లేదని వాపోయారు. ఇసుక లోడ్ కోసం అనుమతి ఇస్తే వై ఫారం (ట్రాన్జిట్ పాస్) జారీ చేసినప్పటికీ, అది కేవలం గంటన్నర వ్యవధి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఆ వ్యవధి దాటితే ట్రాక్టర్‌ను సీజ్ చేసి సుమారు రూ.40 వేల జరిమానా విధిస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవేళ సీజ్ చేస్తే తిరిగి చేతికి వచ్చేసరికి నెల రోజులు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమ గోడు విని నిబంధనలు సడలించాలని కోరారు. వినతిపత్రం సమర్పించినవారిలో దూడల శ్రీనివాసరావు, వై.చంద్ర, కిషోర్ తదితరులు ఉన్నారు.
గుండెపోటుతో బలరాం మటం మృతి
కొరాపుట్: జిల్లాలోని నందపూర్ సమితి మాజీ చైర్మన్ బలరాం మటం(57) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఆయన 1997 నుంచి 2002 వరకు జనతాదళ్ పార్టీ మద్దతులో పదవిలో కొనసాగారు. పొడువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లురు గ్రామ పంచాయతీ దిమిరి ఖుతుబ్ గ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. బీజేడీ మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం పొడాల్, పీతం పాఢీ, ప్రపుల్ల పంగిలు సంతాపం తెలిపారు.
ఏసీ లక్ష్మీ బస్సులు ప్రారంభం


