పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్
● కటక్ నెర్గుండి సమీపంలో దుర్ఘటన
● ప్రాణహాని శూన్యం: డీఆర్‌ఎం
రైళ్ల దారి మళ్లింపు
ఈ ప్రమాదంతో రైల్వే రవాణా ప్రభావితం అయింది. ప్రయాణికుల అసౌకర్యం తొలగించేందుకు దిగువ దిశలో భువనేశ్వర్ నుంచి భద్రక్ వైపు వెళ్లే రైళ్లను బారంగ్ – నెర్గుండి – కపిలాస్ రోడ్ ద్వారా మళ్లించి నడిపించారు. ఈ జాబితాలో రైళ్ల వివరాలు..
● 12822 పూరీ – హౌరా ధౌలీ ఎక్స్‌ప్రెస్
● 12875 పూరీ – ఆనంద్ విహార్ నీలాచల్ ఎక్స్‌ప్రెస్
● 22606 తిరునెల్‌వెలి – పురులియా ఎక్స్‌ప్రెస్
● 12704 సికింద్రాబాద్ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
● 12513 సికింద్రాబాద్ – సిల్చార్ ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్: బెంగళూరు – కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం కటక్ మార్గంలో నెర్గుండి స్టేషన్ సమీపంలో సుమారు 11.54 గంటలకు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణ హాని సంభవించలేదని స్థానిక మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం హెచ్‌ఎస్ బాజ్వా తెలిపారు. డౌన్ లైన్ మాత్రమే ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల రైళ్లు అప్‌లైన్‌లో తాత్కాలికంగా నడిపించారు.
ప్రమాదం సమాచారం అందడంతో తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ మరియు ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం), ఇతర సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సహాయ, పునరుద్ధరణ చర్యలను సమన్వయం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించడానికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో బాధిత ప్రయాణికులకు తాగు నీరు, అల్పాహారం మరియు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.
ప్రమాదంలో ఒకరి మృతి
కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం కటక్ జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే తెలిపారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నత చికిత్స కోసం వీరందరినీ కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. మృతుడిని ఆలీపూర్ ప్రాంతీయుడు శుభంకర్ రాయ్‌గా గుర్తించారు. కుటుంబీకులతో కలిసి బెంగళూరు నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తన తల్లి హృద్రోగ చికిత్స కోసం బెంగళూరు తీసుకుని వెళ్లి తిరిగి వస్తుండగా ఇలా జరగడం విచారకరం.
అధికారులతో సంప్రదించిన పీసీసీ చీఫ్
ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఘటనా స్థలం సందర్శించారు. అక్కడి సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలకు సంబంధించి ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం హెచ్. ఎస్. బాజ్వాతో ముఖాముఖి సంప్రదించి బాగోగులు పర్యవేక్షించారు. కేంద్ర రేంజ్ ఇనస్పెక్టరు జనరల్ ప్రవీన్ కుమార్, కటక్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంటు పీఆర్‌ఎస్ ప్రతీక్, కటక్ చౌద్వార్ నియోజక వర్గం ఎమ్మెల్యే సౌవిక్ బిశ్వాల్ ప్రమాద స్థలం సందర్శించారు.
పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్


