నెర్గుండి రైలు మార్గం యథాతథం
భువనేశ్వర్: బెంగళూరు–గౌహతి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం కటక్–భద్రక్ రైల్వే సెక్షన్‌లోని కేంద్రాపడా రోడ్, నెర్గుండి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పడంతో రైలు సేవలు తాత్కాలికంగా స్తంభించి పోయాయి. కటక్ – నెర్గుండి రైలు మార్గంలో పట్టాల వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. సోమవారం ఉదయం 7.15 గంటలకు పునరుద్ధరణ కార్యకలాపాలు పూర్తిగా ముగించి రైళ్ల రవాణాకు అనుమతించారు. ఆ తర్వాత విద్యుత్ రైళ్ల నిర్వహణ వ్యవస్థ ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓహెచ్‌ఈ) పునరుద్ధరించారు. ప్రభావిత డౌన్ లైన్‌లో తొలి రైలు సోమవారం ఉదయం 9.30 గంటలకు నడిచింది. కాసేపటి తర్వాత అప్–లైన్‌లో రైలు సేవల్ని యథాతథంగా పునరుద్ధరించారు. బెంగళూరు – గౌహతి ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కారణంగా ఈ మార్గంలో రైళ్ల కదలికలను తాత్కాలికంగా సర్దుబాటు చేసి నడిపించారు. ఈ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 38 డౌన్ లైన్ రైళ్లను, 17 అప్ లైన్ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల గుండా మళ్లించింది.
పోలీసుల నిఘా
భువనేశ్వర్: బాలాసోర్ ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. త్వరలో ఆరంభం కానున్న శ్రీ రామ నవమి పూజల సన్నాహాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా ముమ్మరం చేశారు. ఈ జిల్లా సొరొ మునిసిపాలిటీ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
పోలీసులపై దాడి
● ఇద్దరికి గాయాలు
భువనేశ్వర్: స్థానిక భరత్‌పూర్ బొనొ దుర్గా బస్తీ ప్రాంతంలో అల్లర్లను అణిచివేసే ప్రయత్నంలో పోలీసులు గాయపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా స్థానికులతో వీరికి ఘర్షణ జరిగింది. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగా పోలీసులపై స్థానికులు అకస్మాతుగా తిరుగుబాటు చేశారు. నిందితుని తరలిస్తుండగా పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక మహిళా ఏఎస్‌ఐ, డ్రైవర్ గాయపడ్డారు. దాడితో సంబంధం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
పర్యాటకుల ముసుగులో
గంజాయి రవాణా
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. సోమవారం వేకువ జామున కొరాపుట్ రైల్వే స్టేషన్‌లో కోల్‌కతాకు వెళ్లే సమలేశ్వరి రైలు కోసం ఖరీదైన వ స్త్రాలు ధరించిన మస్కానా అనే ఒక మహిళ, మరో బాలిక వేచి చూస్తున్నారు. వీరిని చూసిన జీఆర్పీ పోలీసులు ఆరా తీశారు. తాము ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చామని చెప్పగానే పొలీసులు అప్రమత్తమయారు. ఇక్కడ కొరాపుట్‌కి పర్యాటకులుగా వచ్చామని చెప్పగా.. వారి వస్తువులు సోదా చేశారు. దీంతో 20 కిలోల గంజాయి పట్టుబడింది. వేరే ప్లాట్‌ఫారం మీద విశాఖపట్నం వెళ్లే రైలు వద్ద ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అంకుర్ కుమార్ అనే మరో యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతని వద్ద మరో 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మాఫియా సాధారణ ప్రజలను తమ ఖర్చులతో కొరాపుట్‌కి పర్యాటకులుగా పంపుతోంది. తిరిగి వెళ్లేటప్పుడు వారి ద్వారా గంజాయి తెప్పించుకుంటున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముగ్గురు నిందితులను జైలుకి తరలించారు.
నెర్గుండి రైలు మార్గం యథాతథం
నెర్గుండి రైలు మార్గం యథాతథం


