396 కేజీల గంజాయి పట్టివేత
సాలూరు రూరల్: పాచిపెంట మండలం ఆలూరు గ్రామం గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 4గంటలకు రెండువాహనాల్లో తరలిస్తున్న 396 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ అంకితా సురానా విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారం మేరకు గరువారం ఉదయం 4 గంటల సమయంలో రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కాపుకాశారన్నారు. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులు పోలీసుల రాకను గమనించి వాహనాలను విడిచి ఒక్కొక్కరు ఒక్కో దిశలో పారిపోయారని తెలిపారు. చీకటి కావడంతో నిందితులు పరారయ్యేందుకు అవకాశం దొరికిందన్నారు. వాహనాల్లో 396 కేజీల గంజాయి పట్టుపడిందని దాని విలువ సుమారు రూ.39 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఆర్బన్ సీఐలు రామకృష్ణ, అప్పలనాయుడు రూరల్ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై పాల్గొన్నారు.
పరారైన నిందితులు


