మూడు చిరుత పులి పిల్లల అలజడి
కొరాపుట్: రాష్ట్ర సరిహద్దులో మూడు చిరుత పులి పిల్లలు అలజడి రేపాయి. నబరంగ్‌పూర్ జిల్లా రాయగర్ సమితిలోని ఏఓబీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నహర్‌పూర్ అటవీ ప్రాంతంలోని జునాబాన్ గ్రామ కొండల్లో పులి పిల్లల అరుపులు స్థానిక గిరిజనులకు వినిపించాయి. అక్కడకు వెళ్లి చూడగా మూడు కూనలు కనిపించాయి. తల్లి కూడా అక్కడే ఉంటుందేమోనన్న భయంతో వారు వెనక్కి వచ్చి అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు. వారు పులి కూనలను సంరక్షించి తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు పులి సంచారంపై జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను వెతుక్కుంటూ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
ప్రజలను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో అమాయక ప్రజలను మోసం చేసిన కేసులో ఒకరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఢెంకనాల్ జిల్లా కామాక్షి నగర్‌కు చెందిన సురేంద్ర పరిడా అనే వ్యక్తి ఖోయిర్‌పూట్ సమితి రాస్‌బేఢా పంచాయతీలో చెరీగూఢ,బనుగూఢ, బుటిగూ గ్రామాల్లో 50 మంది గిరిజనులకు అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేశాడు. 2022 నుంచి ఇలా వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని తీసుకుని పరార య్యాడు. గిరిజనులు బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ వద్దకు మార్చ్ 16వ తేదీన వచ్చి ఫిర్యాధు చేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు డెంకనాల్ జిల్లా కామాక్షినగర్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి ఆదివారం అరెస్టు చేశారు.
పూరీ జగన్నాథ ఆలయంలో మహిళా జర్నలిస్టుపై సేవకుల దాడి
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో సేవకులు మహిళా జర్నలిస్టుపై దాడి చేశారు. ఆమెతో పాటు కెమెరా మ్యాన్ దాడికి గురి అయ్యాడు. వీరివురు గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆది వారం శ్రీ రామ నవమి కవరేజ్ హడావిడిలో ఉండగా సేవకులు వీరిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో వీరి కెమెరా, మొబైలు ఫోన్ లాక్కున్నారు. పది మందికి పైగా సేవకులు ఈ దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడికి ప్రతిస్పందనగా స్థానిక మీడియా ప్రతినిధులు పూరీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల నుంచి అధికారిక ఫిర్యాదుల మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు ఈ విషయంపై శ్రద్ధగా దర్యాప్తు చేస్తున్నారని పూరీ ఎస్పీ హామీ ఇచ్చారు. మేము ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ పేర్కొన్నారు.
ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
పర్లాకిమిడి: పట్టణంలోని మార్కెట్ జంక్షన్ కోమటి వీధి వద్ద రామాలయం ఆవరణలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైశ్యరాజు గోవిందరాజు దంపతులు, పొట్నూరు శివ దంపతులు ఆదివారం సాయంత్రం జరిపించారు. రామాలయం ప్రధాన పూజారి అనుమంచిపల్లి రాజగోపాలచారి, అనుమంచిపల్లి ఉగ్రనర్సింహాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు.
మూడు చిరుత పులి పిల్లల అలజడి


