సేంద్రియ వ్యవసాయం ద్వారా స్థిరమైన అభివృద్ధి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో సేంద్రియ వ్యవసాయం పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఆయన ఆర్.సీతాపురంలో మూడో ఉత్కళ కృషి మేళాను గౌరవ అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కృషి మేళాకు ముఖ్యఅతిథిగా భారత వ్యవసాయ పరిశోధన మండళి (ఐకార్) డిప్యూటీ డైరక్టర్ (ఫిషరీస్) డా.జయకృష్ణ జెన్నా, జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ముఖ్యఅటవీ శాఖ అధికారి కె.నాగరాజు, ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ అనితా పాత్రో తదితరులు హాజరయ్యారు. ఆచార్య డి.ఎన్.రావు మాట్లాడుతూ ముఖ్యంగా సన్నకారు రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందే పంటలు వేయాలని, 2030 కల్లా రైతుల ఆదాయం రెండింతలు కావాలన్నారు. అందుకు సూక్ష్మ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించాలని అన్నారు.
అనంతరం ముఖ్యఅతిధి ఐకార్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ జె.కె జెన్నా మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ఫిషరింగ్ రంగంలో ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని అధిగమించాలన్నారు. అనంతరం అతిథులు వ్యవసాయ మేళాలో ఏర్పాటుచేసిన 50 వివిధ ఎన్‌జీఓ సంస్థలు, ఫార్మర్ ప్రోడక్ట్సు కంపెనీలు, సెంచూరియన్ వ్యవసాయ, ఫిషరీస్, వెటర్నరీ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం మేళాకు విచ్చేసిన కొందరి రైతులకు మట్టి పరీక్షల హెల్త్‌కార్డులు, ఉచిత ఆరోగ్య, నేత్ర పరీక్షలు చేశారు. అనంతరం గౌరవ అతిథులను సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు, మెమొంటో దుశ్శాలువతో సత్కరించారు.


