శ్రీమందిరంలో వనవాస సేవ
భువనేశ్వర్: శ్రీరామ నవమి ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో వనవాస సేవ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏటా పవిత్ర చైత్ర శుక్ల ద్వాదశి నాడు ఈ సేవ నిర్వహిస్తారు. శ్రీరామ నవమి ఉత్సవాలతో పూరీ పట్టణంలో సాహి జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో వీధి కళాకారులు కనులకు కట్టినట్లు శ్రీరామ వనవాసం వివరాలతో ప్రదర్శించిన బహిరంగ నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వనవాస సేవ జరిపారు. ఽశ్రీజగన్నాథ వల్లభ మఠం ప్రాంగణంలో ఈ సేవ నిర్వహించారు. ధూపదీప సేవ అనంతరం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఉత్సవమూర్తులను ఛాత్రఛాయలో ఘంటానాదం మధ్య పల్లకీలో ఊరేగింపుగా శ్రీజగన్నాథ వల్లభ మఠానికి తరలించారు. ఈ ప్రాంగణంలో ప్రత్యేక శయ్యపై ఉత్సవమూర్తులను ఆసీనపరచి వనవాస సేవ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కండేశ్వర్ వీధి కళాకారుల బృందం శ్రీరామ వనవాసం వీధి నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ముగిసిన తర్వాత శీతల భోగ సేవ తదితర ఆచారాలతో ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీమందిరం దక్షిణ గృహానికి తరలించి యథాస్థానంలో పదిలపరచడంతో శ్రీరామ వనవాసం సేవ ముగిసింది.


