డివైడర్‌ని ఢీకొన్న ట్రక్కు
భువనేశ్వర్: స్థానిక పొలాసుణి ప్రాంతంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకేసారి 3 ట్రక్కులు ఒక దాని వెంబడి మరొకటి ఢీకొన్నాయి. ఒక ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత వెనుక నుంచి మరో 2 ట్రక్కులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక ట్రక్కు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం.
నాటు తుపాకీతో వేటగాడు అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి కొయిలిపరి గ్రామానికి చెందిన శుక్ర మడ్కమి అనే వ్యక్తి రెండు నాటు తుపాకీలతో అడవి జంతువుల కోసం సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కోరుకొండ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ వ్యక్తి అడవి నుంచి బయటకు వస్తూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులు అరెస్టు చేసి కోరుకొండ ఐఐసీ హిమాంశు శంకర్ బారిక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ విచారించగా జంతువులను వేటాడేందుకు వెళ్లినట్లు అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
ఇంటి పైనుంచి జారిపడి
వృద్ధుడి మృతి
రాయగడ: ఇంటి పైనుంచి జారిపడిన ఒక వృద్ధుడు మృతి చెందాడు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి కొంధొకతిపాడు పంచాయతీ లోని రింజాబడి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి గంగారావు కడ్రక(50)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంటిపై ఆరబెట్టిన బట్టలను తీస్తున్న సమయంలో కాలుజారి కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని కల్యాణసింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి పేరుతో యువతికి మోసం
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి అంబిలిబేడ గ్రామానికి చెందిన రామ్‌దాస్ అనే యువకుడిని బలిమెల పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు యువకుడు బలిమెల పోలీసుస్టేషన్ పరిధి రస్‌బేడ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల ఇంకో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో రాస్‌బేడ గ్రామానికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని స్వగ్రామంలో బుధవారం అరెస్టు చేసినట్లు ఐఐసీ ధీరజ్ పట్నాయక్ వెల్లడించారు.
సమాచార కమిషనర్‌గా మనోజ్ కుమార్
భువనేశ్వర్: విరామ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ పరిడా ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు ప్రాణ బిందు ఆచార్య, పబిత్ర మండల్, రాష్ట్ర హైకోర్టు న్యాయవాది కల్పనా పట్నాయక్ సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు.
డివైడర్‌ని ఢీకొన్న ట్రక్కు
డివైడర్‌ని ఢీకొన్న ట్రక్కు
డివైడర్‌ని ఢీకొన్న ట్రక్కు


