పెట్రోల్ బంకులో మోసాలపై ఆందోళన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలోని పెట్రోల్ బంకులో మోసాలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓంకార్ బంకుకు వెళ్లిన బైక్‌లో కొద్దిగా పెట్రోల్ కొద్దిగా నీటిని నింపడాన్ని మరికొంతమంది వాహనాదారులు బుధవారం గమనించారు. దీంతో వాహనాలు ఆగిపోవడంతో గ్యారేజ్‌లో చూపించారు. సుమారు పది మంది వాహనాలు ఇలాగే ఆగిపోయాయి. వీరంతా మెకానిక్‌ను సంప్రదించగా.. పెట్రోల్‌లో నీరు కలిసినట్టు నిర్ధారించారు. దీంతో వారంతా బంక్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. బంక్ యజమాని నిలదీశారు. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపి చూస్తే నీరు కలిసినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారంతా గురువారం బంకును పరిశీలించారు. నీరు కలిసిన పెట్రోల్ వేయడంతో అగిపోయిన వాహనాలను బాగు చేయించి ఇవ్వడంతోపాటు పెట్రోల్ కోసం డబ్బులను కూడా ఇచ్చారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బంక్ యజమానిని పోలీసులు హెచ్చరించారు.


