జబాపోదర్‌కు బస్సు ప్రారంభం
బస్సును ప్రారంభిస్తున్న అధికారులు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్రా సమితి కెరిమిట పంచాయతీ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని జబాపోదర్ పంచాయతీకి మో బస్సు సేవా పథకంలో భాగంగా గురువారం బస్సును ప్రారంభించారు. కెరిమిటి పంచాయతీ నుంచి మొ బస్సు పథకంలో జబాపోదర్‌కు బస్సు వేయాలని ఆ ప్రాంత ప్రజలు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయితే నేటి వరకు ప్రజల కోరిక తీరలేదు. మారుమూలనున్న జబాపోదర్ గ్రామానికి వెళ్లేందుకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. ఇటీవల జబాపోదర్ గ్రామంలో జరిగిన ప్రసిద్ధ ఠకురాణి జాత్రకు వెళ్లిన కోట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్రను తమ పంచాయతీకి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరారు. బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కుంధ్ర సమితి బీడీవో కపిలేశ్వర్ తండితో చర్చించి వెంటనే మొ బస్సు సేవా పథకంలో కెరిమిటి నుంచి జబాపోదర్ పంచాయతీకి బస్సు వేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు బస్సును ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుంధ్ర సమితి ఎమ్మెల్యే ప్రతినిధి, బీజేపీ నేత బిప్రనారాయణ ఆచార్య, నాయకులు అభిలాష్ బెహర, ప్రకాశ పట్నాయక్, భగవాన్ పండ, తుషార్ భట్, దిగాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ధనపతి పొరజ, లయిబాన్ గౌఢ పాల్గొన్నారు. బస్సు సౌకర్యం కల్పించినందుకు కెరిమిట, జబాపోదర్ పంచాయతీల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.


