అమ్మవారికి విశేష పూజలు
రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో భాగంగా గురువారం విశేష పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దిన వాసుదేవరావు, వడ్డాది శ్రీనివాస్‌రావు దంపతులు అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ వాయిద్యాల నడుమ జరిగిన పూజల్లో ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ బెరుకో అమ్మవారికి పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం గర్భగుడి నుంచి పూజా వేదిక వరకు వెళ్లిన కమిటీ సభ్యులు అక్కడ సూర్య పూజ, శాలపూజ, దేవి షొపోపచార పూజ, మహాస్నానం, మహాపూజ, హారతి, పుష్పాంజలి పూజల్లో పాల్గొన్నారు. గంజాం జిల్లా కవిసూర్య నగర్ నుంచి వచ్చిన వేదపండితులు ఈ సందర్భంగా గరుడ బొమ్మను చిత్రీకరించారు. అనంతరం ఆ స్థానంలో గరుడ సేవ పూజలు చేశారు.
నగర పరిక్రమణలో అమ్మవారు
దుష్టశక్తుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు నడుం బిగించిన అమ్మవారు ఈ చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిరూపాలుగా కొలిచే ఘటాలు నగర పరిక్రమణలో పాల్గొన్నాయి. అమ్మవారి వెంట ఆమె అక్కచెల్లెళ్లు గ్రామదేవి, భైరవి ఘటాలు కూడా ఉన్నాయి. ఈ ఘటాలను చిన్నారులు మాత్రమే మోస్తారు. వారికి ముత్తయిదువుల్లా ముస్తాబు చేసిన అనంతరం అమ్మవారి ఘటాలను మోయడం ఆనవాయితీ. ఇదిలాఉండగా అమ్మవారు రాత్రి సమయంలో చిన్నారి రూపంలో సంచరిస్తోందని ప్రతీతి. దానికి అనుగుణంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను ఆ చిన్నారుల చేత మోయించారు.
కొనసాగుతున్న చైత్రోత్సవాలు
అమ్మవారికి విశేష పూజలు


