కొనసాగుతున్న చైత్రోత్సవాలు
రాయగడ: పట్టణంలో మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం బారులుతీరారు. మందిరం ప్రాంగణంలోని ప్రత్యేక గదిలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన ఘటాలను దర్శించుకుంటున్నారు. పసుపు, కుంకుమలతో పాటు సీజన్‌లో లభించే మామిడి, పనస తదితర పండ్లను ఘటాల్లో వేసి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన చండీహోమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దీన వాసుదేవరావు, వడ్డాది శ్రీనివాస్‌రావు దంపతులు కూర్చుని పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ చండాహోమం శనివారం రాత్రి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు కూడా ముగుస్తాయి. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అమ్మవారిని దర్శించుకున్నారు.
నిప్పులపై పూజారి నడక
ఉత్సవాలు ముగింపులో భాగంగా నిప్పులపై పూజారి నడిచే కార్యక్రమం శనివారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. వారి సౌకర్యార్థం కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ముళ్ల కంపలతో అమర్చే ఊయలలో పూజారి ఊగే కార్యక్రమం కూడా శనివారం రాత్రి నిర్వహిస్తారు.
కొనసాగుతున్న చైత్రోత్సవాలు
కొనసాగుతున్న చైత్రోత్సవాలు


