తనిఖీలకు రమ్మన్నారు.. వస్తే పొమ్మన్నారు..
ఆమదాలవలస: వికలాంగత్వం పునఃపరిశీలన కోసం ఆమదావలసలోని జొన్నవలస సీహెచ్‌సీకి ఈ నెల 11న హాజరుకావాలంటూ నందిగాం మండలం హరిదాసుపురం సచివాలయం పరిధిలోని పలువురు దివ్యాంగ పింఛనుదారులకు ఈ నెల 1న ఉత్తర్వులు అందించారు. దీంతో హరిదాసుపురం గ్రామానికి చెందిన బమ్మిడి సావిత్రి, గుంట హేమాచలం, నర్సిపురం నారాయణ, చెరుకుపల్లికి చెందిన మామిడి సంతు, రాజాం చంద్రయ్య, ప్రతాప విశ్వనాథపురం గ్రామానికి చెందిన పనిల రామస్వామిలు తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చి, మండుటెండలో ప్రయాణించి శుక్రవారం ఆమదాలవలసలోని ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఇక్కడ ఎటువంటి వికలాంగత్వ పరీక్షలు చేపట్టలేదని, మీ వద్ద ఉన్న ఉత్తర్వులతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో దివ్యాంగులు ఉసూరుమన్నారు. తమకు ఉసురు అధికారులకు, ప్రభుత్వానికి తప్పక తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. తమకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతసేపయ్యాక, వీరి ఆవేదనను చూసిన ఆస్పత్రి సిబ్బంది పాతపట్నం సీహెచ్‌సీకి వెళ్లమని చెప్పి అక్కడి సిబ్బందితో ఫోన్‌లో పునః పరిశీలన చేయించారు.


