వరకట్నం కోసం వేధిస్తున్నారు..
రాయగడ: వరకట్నం తీసుకురావాలంటూ తన అత్తమామలు వేధిస్తున్నారని, నిండు గర్భిణిగా ఉన్న తనపై దాడి చేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన జిల్లాలోని రామనగుడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడారి సమితిలోని శిరిగుడ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ పతికా కుమార్తె కల్పనకు రామనగుడ సమితి పరిధిలోని గోగుపాడు పంచాయతీలోని జర్లింగి గ్రామానికి చెందిన పంచానన్ లిమ్మ కొడుకు సొమనాథ్ లిమ్మతో తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు ఉన్నారు. ఈ క్రమంలో కల్పన మరోసారి గర్భం దాల్చింది. మూడో సంతానం వద్దని.. వెంటనే గర్భస్రావం చేయించుకోవాలని అత్తమామలు కోడలను తరచూ వేధిస్తుండేవారు. భర్త లేని సమయంలో కల్పనను అనేక విధాలుగా హింసిస్తుండేవారు. ఈ విషయాన్ని తన భర్త సొమనాథ్‌కు చెప్పినా వారి మాటలు పట్టించుకోవద్దని భార్యకు నచ్చజెబుతుండేవాడు. ఇదే అదనుగా తీసుకున్న అత్తమామలు కల్పనను కట్నం తీసుకురావాలని వేధిస్తుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం కల్పన భర్త లేని సమయంలో అదనుగా భావించిన కల్పన అత్త సుభాషిణి, మామ లక్ష్మీకాంత్‌లు కల్పనపై దాడి చేశారు. వీరి వేధింపులు భరించలేని కల్పన తన కటుంబీకులకు విషయాన్ని తెలియజేసింది. అనంతరం వారి సహాయంతో శుక్రవారం సాయంత్రం రామనగుడ పోలీస్‌స్టేషన్‌లో తనను వరకట్నం తీసుకురమ్మంటున్నారని, అదేవిధంగా తన గర్భానికి నష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు వివాహిత ఫిర్యాదు


