ఆఫ్‌షోర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
పలాస: మండలంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ నిర్మాణానికి భూములిచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని, నిర్వాసితులకు అన్నివిధాలుగా తగిన న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆఫ్‌షోర్ పనులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పనులు పూర్తయితే సాగునీటితో పాటు పలాస పట్టణ ప్రజలకు తాగునీటి కొరత తీరుతుందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ వద్ద మొదటిగా 7 లక్షల క్యూబిక్‌ల మట్టి పని చేయాల్సి ఉందని, పనులకు అందరూ సహకరించాలని కోరారు. డైవర్సన్ రోడ్డు పనులు కూడా చేపడతామన్నారు. ఇంకా నిర్వాసితుల సమస్యలు ఉన్నాయని, ప్యాకేజీలు అందరికీ వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వాసితుల కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఇరిగేషన్ సీఈ రుద్రమనాయుడు, ఎస్‌ఈ పి.వి.తిరుపతిరావు, ఈఈ శేఖర్‌బాబు, డీఈవీ సుధాకర్, ఆర్డీవో జి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


