కరిగిపోతున్న అడవులు!
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ అటవీ రేంజ్‌లో అడవులు మాఫియా పిడికిలో చిక్కుకొని మరుభూమిగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దట్టమైన అడవులు గల గుప్తేశ్వర్ ప్రాంతంలో కొంతమంది బరితెగించి విలువైన చెట్లను నరికేసి తరలించుకుపోతున్నారు. దీంతో దట్టమైన అటవీ ప్రాంతం ఉనికని కోల్పోతుంది. అడవులకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుప్తేశ్వర్ ప్రాంతంలో గతంలో అనేక రకాల వృక్షాలు ఉండేవని వాటిని పరిరక్షించేందుకు అటవీ విభాగ సిబ్బంది పర్యవేక్షిస్తుండేవారన్నారు. అయితే ప్రస్తుతం అడవుల పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బంది లేరు. దీన్ని అదునుగా చేసుకొని మాఫీయా పెట్రేగిపోతోంది. రేయింబవళ్లు తేడాలేకుండా విలువైన చెట్లను నరికేసి కలపను తరలించుకుపోతున్నారు. ప్రధానంగా విలువైన ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఇప్పుడు అడవిలో లేకుండా పోయాయి. పోడు వ్యవసాయం కోసం కొంతమంది అడవులకు నిప్పు అంటిస్తూ కాల్చి వేస్తున్నా అటవీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో గుప్తేశ్వర్ ప్రాంతం మరుభూమిగా మారుతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అటవీ విభాగ అధికారులు చర్యలు చేపట్టి అడవులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
మరుభూములుగా మారుతున్న.. గుప్తేశ్వర అటవీ ప్రాంతం!
పట్టించుకోని అటవీ అధికారులు
కరిగిపోతున్న అడవులు!
కరిగిపోతున్న అడవులు!


