జూన్ 2 నుంచి బురదల పోలమ్మ ఉత్సవాలు
రాయగడ: గ్రామదేవతగా పూజలందుకుంటున్న స్థానిక భైరవ వీధిలో బురదల పోలమ్మ ఉత్సవాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శనివారం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా బార్జి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా ఎద్దు శ్రీహరి, కోశాధికారిగా బొచ్చ శ్రీనివాసరావు, పలువురు సభ్యులు నియమితులయ్యారు.
జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్
బస్సుసర్వీసు ప్రారంభం
కొరాపుట్: రాష్ట్రంలో చివరి సమితి నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి నుంచి బ్రహ్మపురకు ఓఎస్‌ఆర్‌టీసీ ఆదివారం జగన్నాథ ఎక్స్‌ప్రెస్ ఓల్వో బస్సు సర్వీసును ప్రారంభించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు చందాహండిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటకు బ్రహ్మపుర చేరుకుంటుంది. అదే విధంగా బ్రహ్మపురలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఉదయం 6 గంటలకు చందాహండి చేరుకుంటుంది. చందాహండి, నబరంగ్‌పూర్, జయపూర్, రాయగడ, దిగపొండిల మీదుగా బ్రహ్మపురకు రాకపోకలు సాగిస్తుంటుంది. బ్రహ్మపురలోని ఎంకేసీజీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి వెళ్లే రోగులకు ఈ బస్సు సర్వీసు ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో మహిళలకు సగం ధరకె టికెట్లు ఇవ్వనున్నారు.
పింగిపుట్‌లో వైద్య శిబిరం
రాయగడ: సదరు సమితి పరిధిలోని తడమ పంచాయతీ సింగిపుట్ గ్రామంలో సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఉత్కల్ కుమార్ రథ్, డాక్టర్ జి.వి.రమణ, డాక్టర్ సుకుమార్ త్రిపాఠి, ఫార్మసిస్ట్ ప్రమోద్‌కుమార్ సాహు తదితరులు హాజరై 101 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి 12 మందికి కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరిని పితామహాల్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు రిఫర్ చేసినట్లు డాక్టర్ ఎల్‌ఎన్ సాహు తెలిపారు. వైద్యపరీక్షల్లో భాగంగా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
మల్కన్‌గిరి: మ ల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బోఢపోదర్ పంచాయతీ బారడబందో గ్రామంలోని అడవిలో ఓ యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గ్రామస్తులు కొందరు కట్టెల కోసం అడవికి వెళ్లగా అడవి సమీపంలో చిన్న వంతెన వద్ద ఓ బ్యాగు, చెప్పులు కనిపించాయి. అటుగా వెళ్లగా ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు సర్పంచ్ స్వప్నఖిలోకు విషయం తెలియజేశారు. ఆమె చిత్రకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ముకుందో మేల్క తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దింపి బ్యాగ్ తనిఖీ చేయగా అందులో ఆధార్ కార్డులో వివరాలు కనిపించాయి. యువకుడు మేరు రమేశ్ చంద్ర ఆలాంగ్ అని ఉంది. అతడిని బలిమెల సమీపంలోని సోమనాథ్‌పురం పంచాయతీ అలాంగుడ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, స్నేహితులతో కలిసే ఈ ప్రాంతానికి వచ్చాడని మృతుడి తండ్రి శుకదేవ్ ఆరోపించారు.
జూన్ 2 నుంచి బురదల పోలమ్మ ఉత్సవాలు
జూన్ 2 నుంచి బురదల పోలమ్మ ఉత్సవాలు


