తండ్రీకుమార్తెలపై దాడి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామంలో తండ్రీకుమార్తెలపై దాడి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ట పాపారావు ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తె లక్ష్మిప్రియతో కలిసి స్కూటీపై బోరుభద్రలో ఉన్న వివేకానంద పాఠశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో అదే గ్రామానికి చెందిన పిట్ట ముఖలింగం ఇనుప రాడ్డుతో వెనుక నుంచి దాడి చేయడంతో పాపారావుతో పాటు కుమార్తె కింద పడిపోయారు. కిందపడిన తండ్రీకుమార్తెలపై ముఖలింగంతో పాటు పిట్ట లక్ష్మణరావు, రామారావులు కర్రలతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకొని బాధితులకు సపర్యలు చేసి 108 అంబులెన్సులో కోటబొమ్మాళి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత, ఆస్తి తగదా వల్లే దాడి జరిగిందని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.


