శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
రాయగడ: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా శ్రమదానంతో రహదారిని నిర్మించుకున్నారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై తమ గ్రామానికి రోడ్డు వేసుకున్నారు. జిల్లాలోని బిసంకటక్ సమితి కంకుబడి పంచాయతీలోని జంబుగుడలో ఈ ఘటన జరిగింది. జంబుగుడ గ్రామానికి చెందిన ధీరేన్ కడ్రక అనే యువకుడికి పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలో పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతొ తన పెళ్లికి రాబోయే బంధువులు, ఆత్మీయులు ఇబ్బందులు పడతారని భావించి పెళ్లికి ముందే గ్రామస్తులతో కలసి మూడు కిలోమీటర్ల రహదారికి అవసరమయ్యే ఖర్చును భరించి స్వయంగా గ్రామస్తులతో కలిసి రహదారిని నిర్మించేందుకు సన్నద్ధమయ్యాడు. అందుకు గ్రామస్తుల అనుమతి కూడా తీసుకున్నాడు. దీంతో అందరూ కలిసి వారం రోజుల పాటు శ్రమించి రోడ్డు వేసుకున్నారు.


