27న సిల్వర్ జూబ్లీ వేడుకలు
కొరాపుట్: ఈ నెల 27న జయపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని చాంబర్ అధ్యక్షుడు వి.ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం జయపూర్ పట్టణంలోని వేదిక ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంస్థ ఏర్పడి అర్ధ శతాబ్దం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా పది మంది సీనియర్ సభ్యులను సన్మానం చేస్తామన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 900 మంది వ్యాపారవేత్తలు ఉన్నారని, వారంతా రెండో పూట వర్తక, వాణిజ్య సంస్థలు మూసి వేసి హాజరుకావాలని కోరారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి డి.మాధవ, సభ్యులు పాల్గొన్నారు.
సాహితీ ఉత్సవాలకు ఆహ్వానం
జయపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో మే 10,11వ తేదీల్లో శ్రీశ్రీ కళా వేదిక నేతృత్వంలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ ఉత్సవాలకు జయపురం కవి, పాత్రికేయులు సింహాద్రి శ్రీనివాసరావుకు ఆహ్వానం అందింది. ఉత్సవాలకు హాజరై తెలుగు భాషా పురష్కారాన్ని అందుకోవాల్సిందిగా శ్రీశ్రీ కళా వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ డాక్టర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథిలు ఆహ్వానం పంపించారని శ్రీనివాసరావు శుక్రవారం పేర్కొన్నారు.
లయన్స్ క్లబ్‌లో రక్తదానం
రాయగడ: స్థానిక లయన్స్ క్లబ్‌లో ఒడిశా డిప్లొమా ఇంజినీర్స్ సంఘం, ఆమో ఒడిశా సంస్థలు సంయుక్తంగా శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్లొమా ఇంజనీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్లొమా ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.సోమేశ్వరరావు, ఆమో ఒడిశా ప్రతినిధి శివప్రసాద్ దొర, ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధి విభాగం ఇన్‌చార్జి డాక్టర్ గౌతం పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
భార్యను హతమార్చిన భర్త
రాయగడ: భార్యను గొంతు నులిమి భర్త హత్య చేసిన ఉదంతం జిల్లాలొని చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చందిలి గ్రామంలొ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందిలి గ్రామంలో నివసిస్తున్న లలిత సునా, దుర్యోధన్ సునాలు భార్యాభర్తలు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. బుధవారం నాడు ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతొ కోపోద్రిక్తుడైన దుర్యోధన తన భార్య లిలిత గొంతు నులిమి దాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను జేకేపూర్‌లో గల ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న లలిత కుటుంబ సభ్యులు చందిలి గ్రామానికి చేరుకున్నారు. తన చెల్లెలిని తన బావ హత్య చేశాడని చందిలి పోలీస్ స్టేషన్‌లో మృతురాలి అన్నయ్య సానిబ్ నాయక్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గురువారం దుర్యోధన సునాను అదుపులోకి తీసుకున్నారు.
నదిలో పడి వృద్ధురాలి మృతి
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి బొమ్మిక గ్రామం వద్ద గల మహేంద్రతనయ నదికి గురువారం సాయంత్రం స్నానానికి వెళ్లిన వృద్ధురాలు మునిగి చనిపోయిన ఘటన జరిగింది. బృందా రౌళో (60)గా గ్రామస్తులు గుర్తించారు. మృతురాలి భర్త సహదేవ్ రౌళో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురండి పోలీసు అధికారి ఓంనారాయణ పాత్రో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
27న సిల్వర్ జూబ్లీ వేడుకలు
27న సిల్వర్ జూబ్లీ వేడుకలు


