ప్రధాని చేతులమీదుగా కొరాపుట్ కలెక్టర్‌కు అవార్డు
కొరాపుట్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్ అవార్డు అందుకున్నారు. సోమవారం సివిల్ సర్వీస్ డే సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వేదిక మీద ద ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ఎక్సెలెన్స్ అవార్డుని ప్రధాని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 11 పథకాలను జిల్లాలో ప్రజల వద్దకు చేర్చడంలో కీర్తివాసన్ కృషి చేసినందుకు ఈ అవార్డు లభించింది.
వంశధారలో చేప పిల్లల విడుదల
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న వంశధార నదిలో సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 7.50 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో హాజరయ్యారు. దీనివలన చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న ఎంతోమందికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రప్రథమంగా ఈ తరహా ప్రక్రియను మత్స్యశాఖ చేపట్టడంతో అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, సమితి సభ్యులు, స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దివ్యాంగుడి నిరసన
పర్లాకిమిడి: ఈ నెల 11న పర్లాకిమిడి నుంచి గురండి గ్రామానికి మారుతి అనే ప్రైవేటు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్‌పై రాయితీ ఇవ్వలేదని ప్రశ్నించినందుకు బస్సు నుంచి గెంటేశారని, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపిస్తూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన దివ్యాంగుడు వి.జేమ్స్ సోమవారం ఆదర్శ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు. పర్లాకిమిడి తహశీల్దారు, గురండీ పోలీసులు తనపై అన్యాయంగా కేసులు పెట్టి హింసించినందుకు వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
చోరీ కేసులో నలుగురు అరెస్టు
రాయగడ: జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో నివసిస్తున్న వసతి గృహంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో చింతాడ చిరంజీవి, సామల్ స్వయి, బి.సంతోష్ కుమార్, ఉలక సంతోష్‌లు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఐఐసీ కేకేబీకే కుహరో తెలిపిన వివరాల మేరకు ఈనెల 15వ తేదీన స్థానిక రాణిగుడఫారం సమీపంలోని జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో నివసిస్తున్న ప్రభుత్వ వసతి గృహంలో గుర్తు తెలియని దుండగులు చోరీయత్నం చేశారు. వసతి గృహం గేట్‌ను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే బయట అలికిడి జరగడంతో దుండగులు వెళ్లిపోయారు. సమాచారం తెలు సుకున్న అదనపు కలెక్టర్ కుహరో ఈ మేరకు సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గంజాయి విక్రయిస్తున్న
వ్యక్తి అరెస్టు
జయపురం: జయపురంలో దొంగతనంగా గంజాయి అమ్ముతున్న ఒక వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి వర్గాలు నేడు తెలిపాయి. జయపురం సూర్యమహల్ ప్రాంతానికి చెందిన సూరజ్ సింగ్(20)ను ఐదుగురు సభ్యులు గల ఒక టీమ్ ఆదివారం జయపురం స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశం మేరకు సూరజ్‌ను తమిళనాడుకు తీసుకు పోయారు. 2024 డిసెంబర్‌లో జరిగిన వాహన తనిఖీల్లో సూరజ్ పోలీసులకు దొరికాడు. అప్పట్లో తమిళనాడు పోలీసుల నుంచి అతడు తప్పించుకుని పారిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు దొరికాడు.
ప్రధాని చేతులమీదుగా కొరాపుట్ కలెక్టర్‌కు అవార్డు


