ప్రభుత్వంపై వైద్యుల పోరుబాట
బెల్లంకొండ: గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పేద ప్రజలకు అత్యుత్తమ స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఉన్నత లక్ష్యంతో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగం బలోపేతానికి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీజీ విద్యలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ను ఎత్తివేస్తూ జీఓ జారీ చేసింది. గత ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి, వైద్య రంగాన్ని బలోపేతం చేయగా... కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోగా, తాజాగా ప్రభుత్వ వైద్యుల ఇన్‌సర్వీస్ కోటాలో సీట్ల కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై పీహెచ్‌సీ వైద్యులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 85పై వైద్యులు మండిపడుతున్నారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను వెనక్కి తీసుకోవాలని ఈనెల 10 నుంచి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం తీరు మారకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
జీఓ రద్దుకు వైద్యుల డిమాండ్...
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు గత ప్రభుత్వం పలు రాయితీలను కల్పించింది. నిపుణులైన స్పెషలిస్ట్ వైద్యులను గ్రామాలకు పంపుతూ మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో పనిచేసింది. పీహెచ్‌సీలలో మూడేళ్లపాటు వైద్య సేవలు అందిస్తే... నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో 30శాతం రిజర్వేషన్లు కల్పించింది. కాగా కూటమి ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు కోత విధిస్తూ కొత్తగా జీఓ నెంబర్ 85 తీసుకొచ్చింది. ఈ జీఓలో పీజీ కౌన్సెలింగ్‌లో ఆరు బ్రాంచ్‌లకు మాత్రమే ఈ రాయితీ వర్తించేలా నిబంధనలను విధించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఎనస్తీషియా, ఓపీ గైనకాలజీ వంటి వాటిలో మాత్రమే 15శాతం రాయితీ కల్పించారు. మొత్తంగా క్లినికల్స్, నాన్ క్లినికల్స్‌లో 19 బ్రాంచ్‌లు ఉండగా, కేవలం 6 బ్రాంచ్ లకు మాత్రమే రిజర్వేషన్ వర్తించేలా జీఓ ఇవ్వటంపై పీహెచ్‌సీ వైద్యుల్లో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
పోరుబాట పట్టిన వైద్యులు...
పల్నాడు జిల్లావ్యాప్తంగా ఉన్న 77 పీహెచ్‌సీలు, 10 ిసీహెచ్‌సీలు, మూడు ఏరియా వైద్యశాలలో దాదాపుగా 260 మందికి పైగా వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారే కావడంతో ఈ జీఓ వల్ల తమ వృత్తి ప్రగతికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. జీఓను రద్దు చేయాలని రెండు నెలలుగా అధికారులు శాసనసభ్యులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. గత శనివారం నుంచి విధులకు హాజరైనప్పటికీ అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలను వైద్యులు నిలిపివేశారు.
ఇప్పటికే దశలవారీగా పోరాటం...
జీఓ 85 పై ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈనెల 11 నుంచి దశలవారీగా పోరాటం చేస్తున్నారు. ఈనెల 16వ తేదీ వరకు నిరసన ప్రణాళిక విడుదల చేసి, ఆందోళన కార్యక్రమాల బాట పట్టారు. ఈ నెల 10న పీహెచ్‌సీలకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 11,12 తేదీలలో సేవలలో అంతరాయం లేకుండా నిరసన కొనసాగించి, ప్రభుత్వ చర్చల కోసం ఎదురుచూశారు. 13న అత్యవసర సేవలను మినహాయించి, అన్నీ రిపోర్టింగ్‌లు, వీసీ, టీసీ, అధికారిక కమ్యూనికేషన్‌ల నిలిపివేశారు. 14,15న పీహెచ్‌సీలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే విధుల నిర్వహించి, సాధారణ ఓపీ సేవలు నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి ఎటవంటి స్పందన రాకపోవడంతో 16న ఛలో విజయవాడ ర్యాలీ, డైరక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. అవసరమైతే జీఓ రద్దు చేసే వరకూ నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని వైద్యులు తెలియజేశారు.
జీఓ నెంబర్ 85కు వ్యతిరేకంగా వైద్యుల ఆందోళనలు జిల్లాలో గ్రామీణ వైద్యసేవల నిలుపుదల అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్న పీహెచ్‌సీ వైద్యులు సోమవారం చలో విజయవాడకు పిలుపు ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షలకు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment