ఎద్దుల బీడు ఫర్ సేల్
150 ఎకరాలకు పైగా భూమి
అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిని అనుకుని పలు సర్వే నంబర్లలో 150 ఎకరాలకు పైగా (ప్రభుత్వ భూమి) ఎద్దుల బీడు విస్తరించి ఉంది. పొందుగల, రామాపురం, శ్రీనగర్, శ్రీనివాసపురం గ్రామాల్లో వేల సంఖ్యలో పశువులు ఉన్నాయి. చుట్టూ ఉన్న పంటల పొలాల్లోకి వెళ్లకుండా ఈ బీడుల్లో పశువులు మేత మేసేందుకు కేటాయించారు. అయితే, ఈ భూముల్లో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులతో పాటుగా మరికొంతమందికి అధికారంగా కేటాయించారు. ఇది పోగా సుమారుగా మరో 80 ఎకరాలకు పైగా భూమి ఖాళీగా ఉంది.
సాక్షి, నరసరావుపేట : పశువులకు పచ్చటి గడ్డి అందించడం కోసం వందల సంవత్సరాల కిందట కేటాయించిన భూమిలో గద్దలు వాలడానికి సిద్ధమయ్యాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామ సమీపంలోని ఎద్దుల బీడు భూములను విక్రయించేందుకు ఓ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బేరం పెట్టినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆడ్వాన్స్ కూడా తీసుకున్నట్లుగా సమాచారం.
ఆన్‌లైన్‌లో నమోదు
మిగిలిన భూములను పలువురు అనధికారికంగా రెవెన్యూ అధికారులకు తాయిలాలు ముట్టజెప్పి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకుని, తాజాగా అమ్మకాలకు పెట్టారు. మాజీ సర్పంచ్ నాలుగు ఎకరాల భూములను విక్రయించేందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు పొందుగలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. ఎకరం రూ.12 లక్షల చొప్పున విక్రయించేలా ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ పనులను చక్కదిద్దుకునే యత్నంలో ఆయన నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలోని వ్యక్తులకు ఒకే ఖాతా నంబర్లు వేసుకుని విక్రయానికి పావులు కదుపుతున్నారు. పశువుల కోసం కేటాయించిన ఈ భూములను కాపాడుకునేందుకు ఆయా గ్రామాల్లోని రైతులు కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీలో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. స్థానిక శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు రైతులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఎద్దుల బీడు భూములను కాపాడాలని రైతులతో పాటు స్థానికులు కోరుతున్నారు.
భూములు విక్రయించేందుకు చర్యలు కాపాడాలంటున్న రైతులు, ప్రజలు తాజా మాజీ సర్పంచ్ బేరం పెట్టినట్లు సమాచారం
Comments
Please login to add a commentAdd a comment