పక్కాగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
నరసరావుపేట: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. సచివాలయం నుంచి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సమీక్ష సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించేలా ప్రత్యేకమైన సెల్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో సక్రమంగా సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని అంశాల్లో పల్నాడు జిల్లా ముందంజలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరీక్షల వేళ ఒత్తిడి వద్దు
నరసరావుపేట: పదో తరగతి విద్యార్థులు అనవసర భయాలు, ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పిలుపునిచ్చారు. ఫలితాల గురించి అతిగా ఆలోచించకుండా చేయాల్సిన పనిపై మాత్రమే దృష్టి సారిస్తే ఒత్తిడి దరిచేరదని సూచించారు. కలెక్టరేట్‌లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పోగొట్టేందుకు ’స్ఫూర్తి’ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒత్తిడికి గురైనప్పుడు భయాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులతో పంచుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో కేవలం ప్రారంభం మాత్రమేనని, పరీక్షలకు మించిన జీవితం ఎంతో ఉందని తెలిపారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరీక్షలు అనేవి మన జ్ఞానాన్ని కొలిచే కొలమానాలుగా కాకుండా ప్రదర్శించే అవకాశాలుగా భావించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకున్న వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. నిపుణులు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సమయానికి తగ్గట్టు టైం టేబుల్ తయారు చేసుకుని క్రమపద్ధతిలో చదవాలని సూచించారు. పరీక్షల సమయంలో బాగా చదవడంతో పాటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని తెలిపారు. పరీక్షల ముందు రోజు అర్ధరాత్రి వరకూ చదివి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే పరీక్షలు రాయలేని పరిస్థితి వస్తుందని హితవు పలికారు. సమావేశంలో డీఈవో చంద్రకళ, రిటైర్డు ఐఏఎస్ బి.రాజేశ్వరరావు, వ్యాపారవేత్త వీరరాఘవరావు, ట్రైనర్లు బొండ్లపాటి రాధిక, చిన్నం వెంకట్‌లతో పాటు జిల్లాలోని 456 పాఠశాలల మేనేజ్‌మెంట్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కలెక్టర్ పి.అరుణ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment