అమ్మో.. కేడీ టాక్స్
● సత్తెనపల్లి ప్రజలను పీడిస్తున్న కన్నా–దరువూరి ద్వయం ● కాంట్రాక్టరు దరువూరికి నియోజకవర్గ బాధ్యతలు ● పదవి లేకపోయినా ప్రభుత్వ పనులకు ప్రారంభోత్సవాలు ● రెవెన్యూ, పోలీసు అధికారులకూ అతని మాటే వేదం ● ఎమ్మెల్యే తరఫున వసూళ్లకు బరితెగింపు ● మాట వినని అధికారులపై తప్పని బదిలీ వేటు ● ఇప్పటికే మండలాల్లో పెత్తనమంతా కన్నా కుమారులదే ● దోపిడీలో తమకు అవకాశం లేక తెలుగు తమ్ముళ్ల మండిపాటు
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఇటీవల ఎన్నికల్లో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు. దీనికి అంగ, ఆర్థిక బలాన్ని నియోజకవర్గానికి చెందిన బడా కాంట్రాక్టర్ దరువూరి నాగేశ్వరరావు అందజేసినట్టు ప్రచారం. ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నియోజకవర్గంలో రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు అధికారుల పోస్టింగులు మొదలు అన్ని వ్యవహారాలు దరువూరి చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు.
టాక్స్ కట్టాల్సిందే...
సత్తెనపల్లి పరిధిలోని మట్టి, రేషన్ మాఫియా, కాంట్రాక్టులు, మైనింగ్.. ఇలా అన్ని పనులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఎమ్మెల్యే తరఫున సదరు కాంట్రాక్టరే చూస్తున్నారట. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారు పనిని బట్టి 5–10 శాతం కేడీ టాక్స్ కడితే డబ్బులు పడిపోతున్నాయనే ప్రచారం నడుస్తోంది. అధికారికంగా దరువూరి నాగేశ్వరరావుకు ఏ పదవీ లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బదులుగా ఆయనే ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో లబ్ధిదారులకు సరకులను అందజేస్తున్నారు. ఆయన ఏ అధికార హోదాతో ఇవన్నీ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో అధికారులకు అతను చెప్పిందే వేదం. కాదంటే బదిలీ వేటు వేసి పంపేస్తున్నారు.
తమ్ముళ్లు
బేజారు...
ఎమ్మెల్యే కన్నా కుమారులు నాగేంద్ర, ఫణీలు ఇప్పటికే నియోజకవర్గంలో నాలుగు రూరల్ మండలాలకు దాదాపు రాజులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరికి తోడు షాడో ఎమ్మెల్యే రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నా కుమారులపై చంద్రబాబు, లోకేష్‌లకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు, కూటమి పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టి కాంట్రాక్టర్‌కు పెత్తనం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే గుంటూరులో ఉంటున్నారని, తమకు ఏ చిన్న అవసరం ఉన్నా దరువూరిని కలవాల్సిన దుస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ముఖ్యంగా జనసేన నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదని వాపోతున్నారు.
అమ్మో.. కేడీ టాక్స్
Comments
Please login to add a commentAdd a comment