నీటికి విలవిల
కారెంపూడి: పల్నాడు జిల్లా పరిధిలోని నల్లమల అడవిలో దాదాపు 40 కుంటలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు దాదాపు అన్నీ ఎండిపోయాయి. పెద్దవైన రెండు మూడింట్లో, కాస్త పెద్ద చెరువుల్లో తప్పితే అడవిలో నీటి జాడ లేకుండా పోయింది. సహజ సిద్ధంగా నీరు ఉబికి వచ్చే బుగ్గల నుంచి కూడా జలం రావడం లేదు, సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద, ధనమల్లయ్య స్వామి గుడి వద్ద, బ్రహ్మదేవుడి గుడి వద్ద రాళ్ల మధ్య నుంచి ఉబికొచ్చే జలాలు సరిగా రావడం లేదు. ఒకప్పుడు మండు వేసవిలో కూడా అడవికి వెళ్లిన వారి దాహార్తిని ఇవి తీర్చేవి. ఇప్పుడు నీటి జాడ కరవైన పరిస్థితి నెలకొంది. అడవిలో నీరు లేకపోతే లక్షల పక్షులు, వన్యప్రాణులకు ఇబ్బంది తప్పదు. అడవి పందులు, ఇతర వన్యప్రాణులు సమీప పొలాలు, ఇళ్లలోకి వస్తున్న జాడలు కన్పిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. బోర్ల ద్వారా పంటలకు నీరు పెడుతుండటంతో అవి పొలాల్లోకి చొరబడుతున్నట్లు తెలిపారు. కాకిరాల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని రేగుల కుంటలో గత ఏడాది ఇదే సమయంలో నీరుంది. ఇప్పుడు లేవు. అలాగే మిగిలిన కుంటలు కూడా నీరు లేక నెర్రెలిచ్చి కన్పిస్తున్నాయి.
పరిరక్షణే శరణ్యం..
దీనికి ప్రధాన కారణం నీరు ఆవిరి కాకుండా కాపాడే వృక్షజాతులు కుంట పరిసర ప్రాంతాలలోని అడవిలో అంతరించి పోవడం, వాయుకాలుష్యం వంటివని అధికారులు పేర్కొంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు లేకపోవడం వల్ల కుంటల్లో నీరు నిలవని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా కుంటల పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా గతంలో మర్రి, రావి లాంటి భారీ చెట్లు ఉండేవి. అవి పక్షులకు ఆవాసంగా ఉపయోగపడడంతోపాటు ఆహారాన్ని కూడా అందించేవి. అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు. వర్షాలప్పుడు నిండిన కుంటలు ఏడాది పొడవునా సమస్త ప్రాణికోటికి జీవాధారంగా ఉండేవి. అలాంటి పరిస్థితి నేడు లేకుండా పోయింది. ఫిబ్రవరిలోనే కుంటలు ఎండిపోయిన నేపథ్యంలో రానున్న మండు వేసవిలో ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. పల్నాడు జిల్లా పరిధిలో నల్లమల అడవిలో 40 వరకు కుంటలున్నాయి. కారెంపూడి మండల పరిధిలో రేగుల కుంట, ఎర్ర కుంట, గురమ్మ కుంట, నక్కోడి కుంట, చీమల కుంట, పుట్టు కుంట, మేకల కుంట, గాలి కుంట, అచ్చెమ్మ కుంట, కొండ కుంట, కోమటి కుంట ప్రధానమైనవి. పెద్దదైన కోమటి కుంటలో తప్పితే మిగతా వాటిలో ఫిబ్రవరి నెలలోనే నీరు లేదు. గత ఏడాది ఇదే సమయానికి రేగుల కుంటలో నీరు ఉంది.
నీటి వనరుల సంరక్షణ అవసరం
రేగుల కుంట వద్ద నాటిన మొక్కలకు గతేడాది నీరు పోశాను. ఇప్పుడు అక్కడ చుక్క కూడా నీరు లేదు. దీని వల్ల మూగజీవాలు, పక్షులు వలస వెళ్తాయి. నెమళ్లు, అడవి కోళ్లు వంటి జాతులు మృత్యువాత కూడా పడతాయి. అడవి పందులు, జింకలతోపాటు వన్యప్రాణులు పొలాల్లోకి, సమీప గ్రామాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. భారీగా వర్షాలు పడని ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. మళ్లీ వాన జాడ కన్పించే వరకు నీరుండేది. ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడమే. తగిన చర్యలు తీసుకోకపోతే అడవంతా ఇదే పరిస్థితి రావచ్చు. జల వనరులను సంరక్షించాలి.
– కొమెర అంకారావు (జాజి), పర్యావరణవేత్త
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో అడవిలోనూ నీటికి కటకట తప్పడం లేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో చాలా కుంటలు ఎండి పోతున్నాయి. ఒకప్పుడు ఏటా వర్షాలు పడే వరకు ఎంతో కొంత నీరు కుంటల్లో ఉండేది. ఈ ఏడాది వర్షాలు అధికంగా పడినా ప్రస్తుతం ఎండిపోవడం పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. మూగజీవాలకు తాగునీరు లభించడం లేదు.
నీటికి విలవిల
నీటికి విలవిల
Comments
Please login to add a commentAdd a comment