ఘనంగా శోభాయాత్ర
మాచర్ల: పట్టణంలో శుక్రవారం గాయత్రీ మహాయజ్ఞం కనులపండువగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 500 మంది శోభాయాత్రలో పాల్గొన్నారు. తొలుత కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశాక కలశాలతో ముందుకు సాగారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్లి గాయత్రీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. భారీగా దీప యజ్ఞం నిర్వహించారు. అఖిల విశ్వ గాయత్రీ పరివార్ శాంతికుంజ్ హరిద్వార్, మాచర్ల శాఖ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. సీఐ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
వ్యాఘ్ర వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాలుగో రోజు స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవ కై ంకర్యకర్తలుగా పట్టణానికి చెందిన సిందే నారాయణరావు వ్యవహరించారు. ఆలయంలో భక్తులకు దాతలు పొంగలి ప్రసాదం పంపిణీ చేశారు. దేవస్థాన ఈవో జేవీ నారాయణ ఈ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.
ఇంటర్ దూరవిద్య
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూరవిద్య) ఆధ్వర్యంలో మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర కో ఆర్డినేటర్ ఎన్.అక్బర్ అలీ, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియెట్ దూరవిద్య పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులను శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ, ఆయా తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాలలో 2,117 మంది పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు. మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో దూరవిద్య సమన్వయకర్త కె.ఎం.ఎ. హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
26న మల్లయ్య గట్టుకు లాంచీలు
విజయపురి సౌత్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన మాచర్ల మండలం అనుపు నుంచి ఏలేశ్వరస్వామి ఆలయానికి (మల్లయ్య గట్టుకు) ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీలను నడపనున్నట్లు లాంచీ యూనిట్ మేనేజర్ వినయతుల్లా తెలిపారు. శుక్రవారం విజయపురి సౌత్‌లోని లాంచీ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుపు నుంచి ఆ రోజు ఉదయం 7 – మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. టికెట్ ధరను పెద్దలకు రూ.200, ఐదేళ్లు దాటిన పిల్లలకు రూ.150గా నిర్ణయించామన్నారు. రంగనాయకుల స్వామిని దర్శించుకొని ఏలేశ్వరస్వామి గట్టుకు భక్తులు వెళ్లడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శోభాయాత్ర
ఘనంగా శోభాయాత్ర
Comments
Please login to add a commentAdd a comment